ఈ వార్తతోనైనా ఇరాన్‌లో మంటలు చల్లారేనా?
మత విశ్వాసాలు, కట్టుబాట్ల విషయంలో కాస్త కఠినంగానే ఉండే ఇరాన్ కొన్నాళ్లుగా అగ్నిగోళంలా మండుతోంది. కట్టలు తెంచుకున్న మహిళల ఆగ్రహంతో ప్రపంచమంతా ఇరాన్‌వైపు చూస్తోంది. ఈ కట్టుబాట్లు, అడ్డుపరదాలు మాకొద్దంటూ మహిళలు రోడ్లమీదికొచ్చారు. మగవాళ్లు కూడా అండగా నిలిచారు. పదులసంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇరాన్ మహిళల పోరాటస్ఫూర్తికి ప్రపంచవ్యాప్త మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో ఇరాన్‌లో అగ్గిరాజేసిన సంఘటన వెనుక అసలు కారణమేంటో వెలుగుచూసింది.
హిజాబ్‌లు మంటల్లోకి విసిరేస్తున్నారు. కత్తెరలతో నడిబజార్లలో జుట్టు కత్తిరించుకుంటున్నారు. ఈ ఆగ్రహానికి కారణం 22 ఏళ్ల యువతి మరణం. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువతి తర్వాత ప్రాణాలు కోల్పోయింది. కస్టడీలో కొట్టి చంపారంటూ ఇరాన్ అట్టుడికింది. ఆందోళనలను అదుపుచేసే క్రమంలో మరింత హింసరేగింది. అమీని మరణానికి చిత్రహింసలే కారణమని అంతా ఆరోపిస్తుంటే, అనారోగ్యమే ఆమె చావుకు కారణమంటోంది మెడికల్ రిపోర్ట్. సెరిబ్రల్ హైపాక్సియాతో అవయవాలు పనిచేయక ఆ యువతి మరణించినట్లు తేలిందంటోంది ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ.
కుటుంబంతో కలిసి టెహరాన్‌కు వెళ్లినప్పుడు ఆ యువతి ట్రిప్‌కు పోలీసులకు చిక్కింది. హిజాబ్ ధరించలేదన్న కారణంతో పోలీసులు ఆమెను కస్టడీకి తరలించారు. అక్కడ స్పృహతప్పిన యువతి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తే.. శరీరంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మెదడు దెబ్బతిందనేది నివేదిక సారాంశం. ఆ యువతి మరణానికి కారణాలేమైనా ఇరాన్ మహిళాఉద్యమం చల్లారేలా కనిపించడంలేదు. ఆంక్షల సంకెళ్లు తెంచుకునేందుకు ఇప్పుడా మరణమే అందరికీ ఉద్యమస్ఫూర్తి.