ఆయన తర్వాత నువ్వేనా అన్నా..

By KTV Telugu On 23 November, 2022
image

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వెనుక రీజనేంటి ? కేంద్రం భారీ వ్యూహంతో ముందుకు సాగుతోందా ? తదుపరి టార్గెట్ ఎవరన్న చర్చ టీఆర్ఎస్ లో మొదలైందా ? దేనికైనా రెడీ అని టీఆర్ఎస్ ఎందుకు అంటోంది ?

ఐటీ దాడులతో మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి
దాడుల్లో భారీగా నగదు స్వాధీనం
తదుపరి టార్గెట్ ఎవరన్న చర్చ
టీఆర్ఎస్ నేతల్లో పెరుగుతున్న టెన్షన్
బడా వ్యాపారాలు చేస్తున్న గులాబీ నేతలు
తలసాని కుటుంబాన్ని టార్గెట్ చేసిన దర్యాప్తు సంస్థలు
లిక్కర్, రియల్ ఎస్టేట్, గ్రనైట్ బిజినెస్ పై గురి

మంత్రి మల్లారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసి ఆయన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే ఒకే సారి యాభై బృందాలతో ఐటీ శాఖ విరుచుకుపడింది. మల్లారెడ్డికి వైద్య కళాశాలలు, ఇంజినీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 40కి పైగా ఉంటాయి. వచ్చిన ఫీజులను వైట్ నుంచి బ్లాక్ గా మార్చుకుని డబ్బు దాచుకోవడం విద్యా వ్యాపారంలో కామన్ అంశం. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీ కేటగిరి సీట్లకు కోటికి పైగా వసూలు చేసే యాజమాన్యం అందులో సగం బ్లాక్ మనీ తీసుకుంటుంది. వాటిని బ్యాంకులో జమ చేసుకోలేని స్థితిలో తమ నివాసంలో లేదా బంధుమిత్రుల ఇళ్లలో దాచుకుంటారు. ఆ సంగతి బహిరంగ రహస్యమే. ఇప్పుడు దెబ్బకొట్టాలనే కేంద్రప్రభుత్వం ఐటీ శాఖను ప్రయోగించింది.

ప్రస్తుతం రాజకీయాల్లో ఎక్కువ మంది వ్యాపారవేత్తలే ఉన్నారు. టీఆర్ఎస్ లో ఆ బ్యాచ్ ఎక్కువగానే కనిపిస్తుంది. దానితో మల్లారెడ్డి తర్వాత ఎవర్నన చర్చ మొదలైంది. దాడులు చేస్తే భయమేముందీ. స్వాధీనమైన సొమ్ములో కొంత మొత్తాన్ని టాక్స్ గా కట్టేస్తామని టీఆర్ఎస్ నేతలు డాంబికాలు పలుకుతున్నారు. అది అంత సులభం కాకపోవచ్చు. అందుకే ఐటీతో పాటు ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను కూడా బీజేపీ ప్రయోగిస్తోంది. ఒక దర్యాప్తు సంస్థ వదిలేనాటికి మరోటి సీన్ లోకి వచ్చేస్తుంది. అందుకే వారు దర్యాప్తు సంస్థల రాడార్ నుంచి తప్పించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. గత వారం రోజులుగా టీఆర్ఎస్ నేతలు. ఐటీ, ఈడీ విచారణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

చీకోటి ప్రవీణ్ కేసినో కేసు అంతా తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ తిరుగుతోంది. ఆయన సోదరులను, పీఏను ప్రశ్నించారు. కుమారుడికీ నోటీసులు వచ్చాయన్న ప్రచారం జరిగింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమకేమీ జరగదని తలసాని ధైర్యం నటిస్తున్నప్పటికీ లోలోనే భయంగానే ఉన్నారు. చాలా మంది ఐటీ, ఈడీ రాడార్‌లో ఉన్నారని వారంతా జాగ్రత్తగా ఉండాలని సీఎం కసీఆర్ మీటింగ్ పెట్టి మరీ సున్నితంగా హెచ్చరించారు. అంతంకాదిది ఆరంభమేనని అసలు టార్గెట్ల వైపు ఇంకా చూడలేదని కొందరు బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు.

గతంలో రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేసినప్పుడు చాలా వరకూ సమాచారం సేకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా చేసిన సోదాల్లోనూ మరిన్ని వివరాలు బయటపడ్డాయి. గ్రానైట్ మైనింగి కేసులో ఇప్పటికే కీలక సమాచారం అందింది. వాటన్నింటినీ కలిపి దెబ్బకొట్టాలని బీజేపీ నిర్ణయించుకుంది. పైగా ఫామ్ హౌస్ కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ను పూర్తిగా ఇరికించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అలాంటి పనులు చేస్తే వదిలిపెడతామా అని బీజేపీ ఎదురు ప్రశ్న వేస్తోంది..