అమ్మని కావాలనే చంపేశారా? జయ మరణం వెనుక?

By KTV Telugu On 22 October, 2022
image

– అమ్మ అంతిమక్షణాలు అత్యంత దుర్భరం
– కనుసైగలతో శాసించి.. దయనీయంగా కనుమూసి..

అమ్మని కంటికి రెప్పలా చూసుకున్నానని చిన్నమ్మ బుకాయించవచ్చు. రాజకీయంగా ఎదగకుండా చేయడానికే నిందలేస్తున్నారని దబాయించవచ్చు. కానీ ఆర్ముగస్వామి నివేదిక ఊహాజనితం కాదు. అందరితో మాట్లాడింది. ఆధారాలు సేకరించింది. కొన్ని వీడియోల్లో జీవిత చరమాంకంలో జయలలిత దయనీయపరిస్థితి అందరినీ విచలితుల్ని చేస్తోంది. అమ్మని దేవతగా ఆరాధించినవారి రక్తం మరిగిపోతోంది. వైద్యచికిత్సలో నిర్లక్ష్యమా? ఆమెను భౌతికంగా తప్పించే కుట్రలో భాగమేనా? జయలలిత ఫైర్‌బ్రాండ్‌. మహిళ అన్న నిస్సహాయత ఎప్పుడూ లేదు. ఏనాడూ ఆమె ఎవరిపై ఆధారపడలేదు. దశాబ్ధాలపాటు తమిళనాడు రాజకీయాల్ని శాసించిన జయలలిత చివరిక్షణాలు మాత్రం దుర్భరంగా గడిచాయి. నా అన్నవాళ్లెవరూ దగ్గర లేరు. ఏం జరుగుతోందో ఆమె సహచరి శశికళకే తెలుసు. చిన్నమ్మ అదుపాజ్ఞల్లోనే అంతా జరిగిపోయింది. ఆస్పత్రినుంచి జయలలిత భౌతికకాయం బయటికొచ్చింది. ఆస్పత్రిలో రెండున్నర నెలలున్నారు జయలలిత. 75 రోజుల్లో ఆమెకు అందిన చికిత్సపై ఆర్ముగస్వామి నివేదిక తర్వాత ఎన్నో సందేహాలు.

ఏ రోజు ఏ గంటలో ఆమె ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందో, డాక్టర్లు ఎలాంటి చికిత్స అందించారో ఆర్ముగస్వామి కమీషన్‌ లోతైన నివేదిక ఇచ్చింది. జయలలిత సూచనల్ని ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఆమె ఆరోగ్యపరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోలేదు. తాము అనుకున్న(!) ట్రీట్మెంట్‌ని అందిస్తూపోయారు. ఎయిమ్స్‌ వైద్యబృందం వచ్చాక జయలలిత ఆరోగ్యపరిస్థితి కాస్త మెరుగుపడుతున్నట్లు అనిపించినా మళ్లీ మొదటికే వచ్చింది. ఓ దశలో ఆస్పత్రిలో జరుగుతున్నదాంతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడ్డ జయలలిత తాను ఇంటికి వెళ్తానని కూడా చెప్పారు. కానీ చివరికి అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆర్ముగస్వామి నివేదికతో ఇప్పుడు జయలితకు జరిగిన ట్రీట్మెంట్‌పై పోస్ట్‌మార్టం జరుగుతోంది.