తొందరపడ కూడదు. అవసరం లేనప్పుడు సమయం రానప్పుడు మాట దాటవేయాలి, మీడియాకు, ఓటర్లకు అర్థం కాకుండా పొంతనలేని సమాధానాలివ్వాలి… అదీ రాజకీయమంటే… ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎన్నికలు ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే టీడీపీ, జనసేన పొత్తుల చర్చలు మొదలు పెట్టాయి. వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తోడై అయోమయ ప్రకటనలతో మరింత ఆజ్యం పోశారు. అధికారంలో ఉన్న వైసీపీ పండుగ చేసుకునే అవకాశమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ పొత్తుల చర్చలు మొదలయ్యాయి. ఎన్నికలు సుదూరంలో ఉన్నప్పటికీ ఇప్పుడే జత కట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఈ ప్రకటనలున్నాయి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ పడి మరీ పొత్తులపై మాట్లాడేశారు. పొత్తులకు సిద్ధమన్న చంద్రబాబు స్టేట్ మెంట్స్ ఇస్తున్న తీరే అనుమానాస్పదంగా ఉంది. ఉత్తరాంధ్రలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పదే పదే పొత్తులను ప్రస్తావించారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పొత్తులకు తాను నాయకత్వం వహిస్తానన్నారు. అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధమేనన్నారు..
పొత్తులపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. పొత్తుల కోసం చర్చలు అవసరమంటూ చంద్రబాబుకు సంకేతాలు పంపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు. పొరపాటును వైసీపీ మళ్లీ గెలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని పవన్ అన్నారు. చంద్రబాబు పొత్తుల ప్రస్తావన చేస్తే ఆలోచిస్తామని అంటూనే… త్వరలో అద్భుతం జరుగుతుందన్నారు. మరో పక్క పొత్తుల ప్రస్తావనను సోము వీర్రాజు కామెడీ చేశారు. చంద్రబాబు త్యాగాలు చాలాసార్లు చూశామన్నారు. అయితే కుటుంబ, అవీనితి పార్టీలతో పొత్తు పెట్టుకునే అవసరం బీజేపీకి లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు..
సీఎం అభ్యర్థి ఎవరు ?
విపక్షాలకు విరుచుకుపడేందుకు అవకాశం లేక.. నానా తంటాలు పడుతున్న అధికార వైసీపీకి… పొత్తు చర్చల రూపంలో ఒక సువర్ణావకాశం వచ్చింది. టీడీపీ, జనసేనతో పాటు ఏ ఏ పార్టీలు కలుస్తాయంటూ వాళ్లు నిలదీస్తున్నారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనీ వైసీపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. దానితో ఇప్పుడు క్లారిటీ అయినా ఇవ్వాలి, లేదా సమాధానం చెప్పకుండా దాక్కోవాల్సిన అనివార్యత ఆ రెండు పార్టీలపై పడింది. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా గుర్తిస్తే… పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు పాతరేసుకున్నట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి సుదర్ఘ కాలం ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. సీఎం పదవిని ఇంకొకరికి వదులుకునే అవకాశం లేదు. పైగా జనసేన కంటే టీడీపీ ఎంతో బలవంతమైన పార్టీగా ఉంది. పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పక్షంలో టీడీపీలోనే విభేదాలు ఏర్పడి పార్టీ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది….
సజ్జల, కొడాలి అటాక్
చంద్రబాబు, పవన్ పొత్తులపై ప్రకటనలు వచ్చిన 24 గంటల్లోపే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దూకుడు పెంచారు. ఒకరు త్యాగాలు అంటే…మరొకరు నేనే సీఎం అనడం వెనుకు ఉద్దేశమేమిటన్నది సజ్జల ప్రశ్న. చంద్రబాబు త్యాగం అంటే.. సీఎం పదవిని పవన్ కు వదిలేస్తారా అన్నది సజ్జల సంధించిన ప్రధాన ప్రశ్న. కొడాలి నాని అయితే రెండాకులు ఎక్కువే తిన్నారు.
ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు కలలు కంటున్నారని కొడాలి నాని విమర్శించారు.టీడీపీ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా అధికారంలోకి రాలేదన్నారు. పొత్తు లేకుండా గెలచిన చరిత్ర చంద్రబాబుకు లేదని అంటూనే.. ఇకపై ఆయన ఆటలు సాగవన్నారు. ఎన్ని గుంపులు వచ్చినా చెల్లా చెదురు చెయ్యడానికి సింహం రెడీగా ఉందంటూ 2024లో వైసీపీకి 151 స్థానాలకు పైగా వస్తాయన్నారు. ఏదేమైనా సీఎం అభ్యర్థి ఎవరూ అన్న ప్రశ్నతో ఇప్పుడు టీడీపీ, జనసేన డిఫెన్స్ లో పడిపోయే అవకాశం ఉంది.