జగన్ చేయగలిగింది… కేసీఆర్ ఎందుకు చేయలేకపోతున్నారు !?

By KTV Telugu On 3 May, 2022
image

తెలుగు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీల రాజకీయం మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మొదట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను జగన్ ఫాలో అయ్యారన్న ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు కేసీఆర్‌ను మించి జగన్ రాజకీయం చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంకా చాలా విషయాల్లో నాన్చుతూనే ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పాలన గురించి పక్కన పెడితే పార్టీ వ్యవహారాల్లోనూ ఇదే పరిస్థితి. దానికి స్పష్టమైన సాక్ష్యం నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీ . వైసీపీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులను జగన్ ఫటాఫట్ భర్తీ చేసి పార్టీ నేతలందరికీ ఓ పదవి ఉండేలా చూసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో నెలల తరబడి పార్టీ నేతలను వెయిట్ చేయించేలా చేస్తున్నారు.

అరకొరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ !

పార్టీ కోసం పని చేసే వాళ్లకు కచ్చితంగా పదవులు వస్తాయని.. ఇందుకోసం ఓపికగా ఎదురుచూడాలని చాలా సమావేశాల్లో కేసీఆర్ చెప్పారు. ఆ కొద్దిరోజులు కాస్తా ఇప్పుడు వారాలు.. నెలలుగా మారాయి. కానీ ఎదురు చూపులు ఫలించడం లేదు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో కొన్ని నామినేటెడ్ పోస్టులను త్వరత్వరగా భర్తీ చేశారు. పార్టీలోని అసంతృప్తి నేతలపై ఇతర పార్టీలు దృష్టి పెట్టాయని గ్రహించి.. పార్టీ వీడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పదవుల ఆశ పెట్టుకున్న నేతలు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కేసీఆర్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వాటిని భర్తీ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికీ అదే పద్దతి.

పార్టీ క్యాడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి !

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధినేత నామినేటెడ్ పోస్టుల భర్తీని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని.. టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తోందని గతంలో తెలంగాణ భవన్‌లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసీఆర్ ఈ అంశంపై సీరియస్‌గానే కసరత్తు చేస్తున్నారనే సంకేతాలు పార్టీ నేతలు, శ్రేణుల్లోకి వెళ్లాయి. మంచి రోజులు వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నారు. అలాంటి మంచి రోజులు ఇంకా రాలేదు. ఇప్పటికీ ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలు కొందరు.. ఎవరి స్థాయిలో వాళ్లు అధినాయకత్వంతో టచ్‌లో ఉండే నేతలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల వేడి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వారి ప్రయత్నాలు .. అసంతృప్తి దిశగా వెళ్తున్నాయి.

పార్టీ పదవుల భర్తీలోనూ ఆలసత్వమే !

గత ఏడాది చివరిలో పార్టీ ప దవుల భర్తీ అంటూ హడావుడి చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా కమిటీ, డివిజన్ కమిటీలను నియమించారు కానీ రాష్ట్ర కమిటీని మాత్రం పెండింగ్ లో పెట్టింది. ప్లీనరీ చేశారు కానీ రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించలేదు. ఆదినుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ఉద్యమకారులకు సైతం గుర్తింపు దక్కడం లేదని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పార్టీ క్యాడర్‌లోఇంత అసంతృప్తి పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ఇబ్బందికరమని.. కేసీఆర్ ఏదో ఒకటి చేసి ఉత్సాహం తీసుకురావాలని .. నేరుగా హైకమాండ్‌కు సూచనలు పంపుతున్నారు. అయితే ద్వితీయ శ్రేణి నేతల్లో నెలకొన్న అసంతృప్తిని మాత్రం కేసీఆర్ గుర్తించడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఎక్కువగానే ఉంది.

పదవులిస్తే ప్లస్సా ? మైనస్సా ?

నిజానికి అధికార పార్టీలు నామినేటెట్ పోస్టుల భర్తీ విషయం ఆచితూచి వ్యవహరిస్తాయి. పదవులు పొందేవారు చేసే పనులతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుదంని వారి భయం. అది నిజం కూడా. కానీ పరిస్థితుల మారాయని జగన్ వంటి వారు చూపిస్తున్నారు. ఆయన కొత్త కొత్త కార్పొరేషన్లు కూడా పెట్టి.. వాటికి నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ నేతలకు పదవుల పంపకం చేశారు. వారంతా తమకు పార్టీ గుర్తింపు ఇచ్చిందనే కృతజ్ఞతతో ఉంటారు. వారు చేసే పనులపై వ్యతిరేకత వస్తుందా లేదా అన్నది తర్వాత సంగతి .. కానీ ఇప్పటికే కేసీఆర్ అలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. కేసీఆర్ స్ట్రాటజీ కరెక్టో.. జగన్ స్ట్రాటజీ కరెక్టో… ఎన్నికల తరవాతే తేలుతుంది.