ఆవేశం అనర్థదాయకం.. పవన్‌కల్యాణ్‌కి తెలీదా!
ఏదో చేయాలి. ఏదో ఒకటి చేయాలి. తిమ్మినిబమ్మిని చేసయినా సరే సర్కారుపై వ్యతిరేకత పెంచాలి. ఎప్పుడూ జనంలోనే ఉండాలి. ఏపీలో ఇప్పుడు జనసేన టార్గెట్ ఇదే. మంచిదే ఏ పార్టీ అయినా బతికి బట్టకట్టాలంటే జనం మధ్యనే ఉండాలి. ప్రభుత్వ వైఫల్యాలుంటే తప్పుపట్టాలి. కానీ కోడిగుడ్డుమీద ఈకలు పీకుదామనుకుంటేనే బూమరాంగ్ అవుతుంది.
గ్లాస్ పార్టీ పెట్టిన కొత్తలో బీజేపీ-టీడీపీతో కలిసి చీర్స్ కొట్టారు. పోయిన ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీతో తేడాకొట్టింది. మొన్నటిదాకా బీజేపీతో అంటకాగి ఆ బంధం కూడా కష్టమేనన్నట్లు సంకేతాలిచ్చారు. మోడీ వైజాగ్ టూర్‌లో ప్రత్యేక ఆహ్వానంతో అలక కాస్త చల్లారినట్లుంది. అయినా ఏం చేయాలన్నదానిపై క్లారిటీ లేదు. అందుకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పవన్‌కల్యాణ్ కొత్తరాగం. ప్రజలు విజ్ఞులు. ఎవరొచ్చినా వస్తారు ఎవరేం చెప్పినా వింటారు.
అంతిమంగా నిర్ణయం మాత్రం వారి గుండెల్లోంచి వస్తుంది. దాన్నెవరూ మార్చలేరు. మంచి నిర్ణయాలను స్వాగతించటం ప్రజలకు నష్టదాయకమనుకుంటే వ్యతిరేకించడం రాజకీయ నాయకులకు ఉండాల్సిన విజ్ఞత. కానీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటే, ప్రతీ పనినీ తప్పుపట్టాలనుకుంటే తప్పటడుగులు వేసినట్లే. పవన్‌కల్యాణ్‌కి ఎవరు సలహాలిస్తున్నారోగానీ ఆయన అడుగులు తడబడుతున్నాయి. జగనన్న ఇళ్లమీద జనసేన రాద్ధాంతం చేస్తోంది. ప్రతీచోటా నూటికి నూరుశాతం పారదర్శకంగా జరిగిందని చెప్పలేం. అలా కోరుకోవడం కూడా అత్యాశే. కొన్నిచోట్ల కక్కుర్తిపడ్డవారు ఉండొచ్చు. కొన్నిచోట్ల అనర్హులకు అవకాశం ఇచ్చుండొచ్చు. అలాంటివి పిన్‌పాయింట్‌గా పట్టుకుని జనసేన జనంలోకి వెళ్లొచ్చు గొడవచేయొచ్చు. కానీ అతిశయోక్తులతో అపనిందలు వేస్తే మనకు విశ్వసనీయత లేకుండాపోతుంది. రాజమండ్రిలో జగనన్న ఇళ్లమీద జనసేన నిరసన తోపులాటకు దారితీసింది.
దీంతో ఇదే టెంపో అన్నిచోట్లా కొనసాగాలని ఆ పార్టీ కోరుకుంటోంది. జనసైనికులు చూసిరమ్మంటే కాల్చి వస్తారు. అంతా అరివీర అభిమానగణమే కదా. అయితే చేసే విమర్శలు, ఆరోపణలు లెక్కతప్పకూడదు. మొత్తం పథకానికి ఖర్చుపెట్టిందెంతో కూడా చూస్కోకుండా అంత అవినీతి జరిగిందంటే నమ్మశక్యంకాదు. మంత్రి బొత్స ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఉతికారేసింది ఈ పాయింట్‌ని పట్టుకునే. 10నుంచి 15వేల కోట్ల అవినీతి జరిగిందని కాకి లెక్కలు చెప్పేస్తే ఆ ఆరోపణ నిలవదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆరోపణ అక్షరసత్యమని నిరూపించుకునే ప్రయత్నంలో అంకెలను అటూఇటూ చేసి నాగబాబు ఇంకాస్త కంగాళీ చేసేశారు. ఆకలైతే కంచాన్ని నోట్లో పెట్టుకోలేంగా ఒక్కో ముద్దా తినాల్సిందే. లేడికి లేచిందే పరుగైతే ఎలా!