ఆ గట్టునుంటావా పవనన్న.. ఈ గట్టునుంటావా.!

By KTV Telugu On 21 November, 2022
image

టీడీపీ, బీజేపీ మధ్యలో నలిగిపోతున్న పవన్
లోక కళ్యాణం కోసం సాయం అవసరమన్న అయ్యన్నపాత్రుడు
లోకేష్ కళ్యాణార్థం కోసం బాబు ఆరాటమంటూ జీవీఎల్ ట్వీట్
జనసేనాని బాబు దగ్గరకు వెళ్లకుండా మోకాలడ్డుతోన్న బీజేపీ?

నారీ నారీ నడుమ మురారీ సినిమాలో బాలకృష్ణ మాదిరే… ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి తయారైంది. ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగిపోతివా అన్నట్టు టీడీపీ, బీజేపీల మధ్యలో పడి జనసేనాని నలిగిపోతున్నారు. ఆ రెండు పార్టీలు ఇప్పుడు పవన్ జపం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఢీకొట్టాలంటే జనసేనతో జతకట్టాల్సిందేనని తమ్ముళ్లు అంటున్నారు. అందుకోసం చంద్రబాబు పవన్‌ను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం అదేం కుదరదు అంటున్నారు. పవన్ మావాడు అంటున్నారు. ఎప్పటికప్పుడు బాబు నుంచి జనసేనానిని దూరం పెట్టే ఎత్తుగడతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నాయని జోస్యం చెబుతున్నారు. పవన్ కోరుతున్న ఒక్క ఛాన్స్‌కు తమ సంపూర్ణ మద్దతుంటుందని స్పష్టం చేస్తున్నారు. టీడీపీతో వెళ్లేందుకు పవన్ ఆసక్తి చూపుతున్నప్పటికీ కమలదళం మోకాలడ్డుతుండడంతో జనసేనాని సందిగ్ధంలో పడిపోయాడని అంటున్నారు విశ్లేషకులు. ఏ గట్టునుండాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల కోసం ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎవరితో కలుస్తారు. టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? బీజేపీ-జనసేన పొత్తు ఉంటుందా? లేక ముగ్గురూ కలిసే అవకాశముందా? రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ప్రధానితో భేటీ తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందని.. టీడీపీతో పొత్తు ఉండే అవకాశాలు తక్కువంటూ ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో చంద్రబాబు అందిరనీ కలుపుకొని వస్తాము అంటూ సభల్లో చెబుతున్నారు. బీజేపీ మాత్రం జనసేనతో తప్ప టీడీపీతో పొత్తు ఛాన్స్ లేదని తేల్చి చెబుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక అందుకు కౌంటర్‌గా బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన ట్వీట్‌ రాజకీయ వేడి పెంచింది. శ్రీరాముడు బలవంతుడే అయినా రావణ సంహారం కోసం ఇతరుల సాయం తీసుకున్నాడంటూ అయ్యన్న చెప్పుకొచ్చారు. లోక కల్యాణం కోసం ఆంజనేయుడు, విభీషణుడు, ఉడత సాయం కూడా తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేసారు. టీడీపీ బలంగా ఉన్నప్పటికీ అంతకంటే బలంగా ఉన్న జగన్‌ను ఎదుర్కోవాలంటే ఇతర పార్టీల మద్దతు తప్పనిసరే విషయాన్ని అయ్యన్న స్పష్టం చేశారు.

అయ్యన్న వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఘాటుగా స్పందించారు. భగవంతుడయిన శ్రీరాముడితో, చంద్రబాబును పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. అదేసమయంలో పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు. ఇతరపార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? అంటూ టీడీపీ నాయకత్వంపై మండిపడ్డారు. మీ నాయకుడి ఆరాటం లోక కళ్యాణం కోసం కాదు. “లోకేష్”కళ్యాణార్థం అని అందరికీ తెలుసు..” అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. పవన్‌ వద్దంటున్నా వెంటబడుతున్న బీజేపీ నేతలు ఇతర పార్టీలతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతుందని చెప్పడం హాస్యాస్పదమంటున్నారు తమ్ముళ్లు. భవిష్యత్‌లో జనసేన బీజేపీతో ఉంటుందా? లేక టీడీపీతో కొనసాగుతుందా? అనే అంశంపైన పవన్ కళ్యాణ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు. ప్రస్తుతానికి బీజేపీతో ఉన్నామనే అంశాన్ని మాత్రమే పార్టీ నేతలు చెబుతున్నారు. పొత్తుల అంశం తేలే వరకు ఈ ఉత్కంఠ తప్పేట్లు లేదు.