సినిమాల్లోనే పవన్ కల్యాణ్! పార్ట్ టైమ్ పాలిటిక్సేనా?

By KTV Telugu On 24 May, 2022
image

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. సుదీర్ఘ కాలం అమల్లో ఉండేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. సినిమా కెరీర్‌కు సంబంధించి… ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. కానీ మరో వైపు చూస్తే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడు సమయం కేటాయిస్తారో తెలియని పరిస్థితి. ఎన్నికల మూడ్ ఇప్పటికే వచ్చేసింది. పొత్తుల చర్చలు జరుగుతున్నాయి. జనసేన కీలకంగా కనిపిస్తోంది. కానీ పవన్ మాత్రం ఫుల్ టైం కేటాయించడం అసాధ్యమన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఏపీకి వచ్చినప్పుడే రాజకీయం.. మిగతా రోజుల్లో సినిమా వార్తలే కనిపిస్తున్నాయి.

రెండు పడవలపై కాళ్లు పెడితే మొదటికే మోసం !

పవన్ కల్యాణ్ తనకు సినిమా బతుకు దెరువు అని చెబుతున్నారు. అదే సమయంలో రాజకీయాలు తనకు అత్యంత ఇష్టమని చెబుతున్నారు.  రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఈ విషయంలో ఆయన ఫెయిలవుతున్నారని తాజా పరిణామాలను బట్టి తెలుసుకోవచ్చు. పార్టీ కోసం పవన్ కేటాయిస్తున్న సమయం చాలా తక్కువగా ఉంది. జనసేన వ్యవహారాలు నాదెండ్ల మనోహర్ ఒక్కరే చూస్తున్నారు. సినిమా షూటింగ్‌లలో తీరిక దొరికినప్పుడు ఓ ఆందోళన కార్యక్రమం.. మరో సభ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల రైతు భరోసా పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అందు కోసం సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. రైతుల్ని ఆదుకుంటున్నారు. కానీ అది ఆ ఒక్క రోజుకే పరిమితమవుతోంది. తర్వాత మళ్లీ సైలెంటవుతున్నారు.

అవకాశాల్ని అందుకోలేకపోయిన వైనం !

ప్రజా సమస్యలు బోలెడన్ని వచ్చాయి. ప్రజల కోసం పోరాడి.. వారి కోసం నిలబడితే.. బేస్ దొరికేది. మొదట ఇసుక సమస్య.. ఆ తర్వాత రాజధాని సమస్య.. ఆ తర్వాత కరోనా.. ఆ తర్వాత ఎల్జీ పాలిమర్స్..  సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఎప్పుడూ ఖాళీగా ఉంచే ప్రయత్నం చేయలేదు. కానీ..  జనసేన మాత్రం వాటిని ఉపయోగించుకోవడంలో వెనుకబడింది. ఇసుక సమస్య కోసం.. విశాఖలో కవాతు నిర్వహించారు.. ఆ తర్వాత సైలెంటయింది. అమరావతిపై మాదే లీడింగ్ ఉద్యమం అన్నారు.. బీజేపీతో పొత్తు పెట్టుకుని సైలెంటయిపోయారు. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. జనసేన పార్టీ ఏడాదిలో చేసిన వ్యూహాత్మక తప్పిదాలు.. ఆ పార్టీకి మైనస్‌గా మారాయి.

సినిమాకు తాత్కాలికంగానైనా బ్రేక్ ఇవ్వాల్సిన సమయం !

పవన్ కల్యాణ్ తన ఫుల్ టైం రాజకీయాలకు కేటాయించాల్సిన సమయం దగ్గర పడింది. కానీ ఆ దిశగా ఆలోచన  చేస్తున్నట్లుగా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం జనసేనకు రాలేదు. వచ్చేఅవకాశం కూడా లేదని పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్‌తో తెలిసిపోతోంది. ఇంత కాలం అయినా జనసేనకు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పవన్ అడుగు పెడితే జనసేన ఉన్నట్లు.. లేకపోతే లేదన్నట్లుగా ఆ పార్టీ రాజకీయం మారిపోయింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ జనసేనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఫుల్ టైం రాజకీయాలు చేయకపోతే … జనసేన పార్టీని ఎక్స్ ట్రాగానే జనం చూసే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల పవన్ కల్యాణ్ రెంటికి చెడ్డ రేవడి అయ్యే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ లాంటి వారు. ఆయన అభిమానులు.. సీఎం సీఎం అని అరిస్తే తప్ప అలర్ట్ కారు .. కానీ మరో పదేళ్ల తర్వాతైనా ఆ స్థాయికి రావాలంటే అకుంఠిత దీక్షతో ఒక్క రాజకీయమే చేయాల్సి ఉంటుంది. లేకపోతే… రెండు పడవలూ మునిగిపోయే ప్రమాదం ఉంది.