స్టార్స్, ఐటమ్స్ ఔట్‌డేటెడ్..ఇప్పుడు కథే హీరో!
పక్క ఉడ్‌లను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది!
సినిమా ఎలా ఉన్నా మన హీరో ఉన్నాడని క్యూలు కట్టేసి గుడ్డిగా చూసేసే రోజులు పోయాయి. హీరో ఎంత పెద్ద పోటుగాడైనా సినిమాలో విషయం లేకపోతే అట్టర్‌ఫ్లాపే. కుర్రహీరో లైగర్ అయినా, మెగాస్టార్ ఆచార్యనైనా ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. నాలుగు స్టెప్పులు, ఆరు ఫైట్లు, ఓ ఐటమ్ పెట్టి చుట్టేస్తే సినిమా అయిపోదు. కాంతారా సంచలనం తర్వాత మన హీరోలు, దర్శకులకు కూడా తత్వం బోధపడుతోంది. కొత్తదనంకోసం ప్రయత్నం మొదలైంది. ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉందో కాంతారా సక్సెస్సే పెద్ద ఉదాహరణ. సినిమా బావుందనే టాక్ వస్తే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోవడం లేదు ఈ కాలపు ఆడియెన్స్.
రిషబ్‌శెట్టి పెద్ద స్టార్ హీరోయేం కాదు. కాంతారా వచ్చేదాకా అతని మొహం చాలామందికి తెలీదు. కానీ శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు, పవిత్ర యజ్ఞంచేసినట్లు ఆ సినిమాని తీర్చిదిద్దారు. అందుకే పాన్ ఇండియా రేంజ్‌లో ఏ భాషలో డబ్ చేసినా సినిమా కనకవర్షం కురిపించింది. ఇప్పుడు మళయాళంలో కూడా ఓ చిన్న సినిమా సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొడుతోంది. మలయాళ చిత్రం ‘జయ జయ జయహే’ అందరినోళ్లలో నానుతోంది. ఇప్పటికే బడ్జెట్ కంటే ఆరేడు రెట్ల ఆదాయంతో హిట్ కొట్టింది.
జయజయ జయహేలో పేరున్న నటీనటులు లేరు. మలయాళంలో అంచనాలు లేకుండా తీసిన చిన్న సినిమా అది. అక్టోబర్ 28న రిలీజైన ఈ సినిమాని కేవలం నెలన్నర రోజుల్లోనే తీయడం విశేషం. రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.42 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో రికార్డు సృష్టించింది. బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ హీరో హీరోయిన్లు. స్వతంత్ర భావాలున్న ఓ మధ్యతరగగతి అమ్మాయి వివాహం తర్వాత ఎదురైన సమస్యలను ఎలా అధిగమించిందనేదే సినిమా కథ. దాన్ని సగటు ప్రేక్షకుడికి హత్తుకునేలా తెరకెక్కించడమే సినిమా విజయరహస్యం. టాలీవుడ్‌కి ఇది మరో పాఠ్యాంశం.