జరిగినదే తలచితివా దైవం ఎందులకూ!
ఫైర్ లేదు బ్రాండ్ లేదు.. ఏమిటో ఈ జీవితం!
పూలమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకోవడం అన్నమాట జేసీ ప్రభాకర్‌రెడ్డికి అతికినట్లు సరిపోతుంది. మీసం మెలేసిన చోట, ఎగిరెగిరి తొడలు గొట్టినచోట ఆయనిప్పుడు అస్థిత్వ పోరాటం చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ మాటే శాసనం. వ్యవస్థల్ని తమ కనుసైగలతో శాసించారు జేసీ బ్రదర్స్. పెద్దాయన దివాకర్‌రెడ్డికి తత్వం బోధపడి బయట పెద్దగా కనిపించడం లేదు వినిపించడం లేదు. కానీ మున్సిపల్ చైర్మన్ హోదాలో తమ్ముడు ప్రభాకర్‌రెడ్డికి తాడిపత్రిలో తిరగక తప్పటం లేదు.
ఒకప్పుడు జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ అంటే నడిపిందే బస్సు. చెప్పిందే చార్జి. మా యాపారం ఇట్టానే ఉంటదంటూ అడ్డొస్తే తొక్కేసేంత పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్లు. ఇప్పుడు బస్సు రోడ్డెక్కడం లేదు. ట్రావెల్స్ స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. చేసిన తప్పులు శాపాల్లా వెంటాడుతున్నాయి. బస్సుల వ్యవహారంలో కక్కుర్తి ఆస్తులసీజ్ దాకా వస్తుందని జేసీ బ్రదర్స్ అస్సలు ఊహించలేదు. ఇదే ఏ రాష్ట్రప్రభుత్వ దర్యాప్తు సంస్థనో ఎంక్వయిరీ చేసి యాక్షన్ తీసుకునుంటే అరచి గోలపెట్టేవాళ్లు. కానీ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిర్వాకాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేటే నిగ్గుతేల్చింది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ రోడ్‌లైన్స్, జటాధర ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆయన బిజినెస్ పార్ట్‌నర్ గోపాల్‌రెడ్డి కంపెనీల రూ.22.10 కోట్ల స్థిర చర ఆస్తులు జప్తుచేసింది.
ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అడ్డదారులు తొక్కితే అదిప్పుడు ఆస్తులకు ఎసరుపెడుతుందని జేసీ బ్రదర్స్ అస్సలు ఊహించలేదు. నోరారా తిడుతూ చేతికి దొరికితే కొడుతూ రెచ్చిపోయే జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోరు పెగలడం లేదు. కాళ్లూచేతులు చచ్చుబడ్డ కరడుగట్టిన రౌడీషీటర్‌లా ఉంది ఆయన పరిస్థితి. ఏమీ అనలేక ఆస్తుల్ని జప్తుచేసిన ఈడీని దేవుడంటున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. తప్పు జరిగిందని పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. తమకు వాహనాలు అమ్మిన అశోక్ లైలాండ్‌ని, రిజిస్ట్రేషన్ చేసిన నాగాలాండ్ అధికారులను కూడా ఎంక్వైరీ చేయాలంటున్నారు జేసీ ప్రభాకర్. నేనెలాగూ మునిగాను నాతోపాటు వాళ్లనూ ముంచేస్తే అవమానం పరిపూర్ణం అవుతుందన్నట్లుంది ఆయనగారి వ్యవహారశైలి.