జిమ్మీ జిమ్మీ.. జియ్ మీ జియ్ మీ.. ఆజా ఆజా..
కరోనాకి పుట్టినిల్లనే పేరుంది. ప్రపంచానికి వైరస్ అంటించిందనే అపనిందలను చైనా భరించింది. ప్రపంచమంతా ఆ మహమ్మారినుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్నా చైనాలో మాత్రం మొదటికొచ్చింది. కొత్త వేరియెంట్ కేసులతో మళ్లీ చైనీయులకు ఆంక్షల సంకెళ్లు పడుతున్నాయి. రెండేళ్లుగా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకపోవటంతో చైనా పౌరులు మానసికంగా కుంగిపోతున్నారు. కఠిన లాక్‌డౌన్ నిబంధనలతో యావజ్జీవ ఖైదీల్లా బావురుమంటున్నారు.
చైనాలో గోడలు దూకి పారిపోతున్నారు. ఈ నిర్బంధం కంటే చావే నయమనుకుంటున్నారు. జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని ఘొల్లుమంటున్నారు. చైనాలో కరోనా ఫ్రస్టేషన్ పీక్‌కి చేరింది. బీజింగ్ సహా ప్రధాన నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్‌లతో జనానికి పిచ్చెక్కుతోంది. కొందరైతే బతుకుజీవుడా అనుకుంటూ ఇళ్లు, ఊళ్లు విడిచి పారిపోతున్నారు. తమను మనుషుల్లా చూడని లాక్‌డౌన్ నిబంధనలపై గొంతెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
డ్రాగన్ కంట్రీకి మనమీద కడుపుమంట ఉంది గానీ అక్కడి జనానికి మాత్రం కష్టకాలంలో మన పాటే గుర్తుకొస్తోంది. మన డిస్కో డ్యాన్సర్ పాటని చైనీయులు వాళ్ల భాషకి అన్వయించుకుని ఆలపిస్తున్నారు. 1982లో మిథున్ చక్రవర్తి హీరోగా వచ్చిన డిస్కో డ్యాన్సర్ సూపర్‌డూపర్ హిట్. బప్పీలహరి మ్యూజిక్‌తో ఆ సిన్మాలోని జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా పాట బాగా పాపులర్. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ ఆ పాటనే అందుకుంది. అదిప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
చైనాలోని షార్ట్ వీడియో మేకింగ్ యాప్‌లలో ఇప్పుడు జిమ్మీ జిమ్మీ పాటే హైలైట్ అవుతోంది. చైనీస్ వెర్షన్ టిక్‌టాక్ డౌయిన్‌ని ఈ పాట ఊపేస్తోంది. మాండరిన్ భాషలో జియ్ మీ, జియ్ మీ అంటే గివ్ మీ రైస్ అని అర్ధం. అంటే బియ్యం ఇవ్వమని. లాక్‌డౌన్‌తో లక్షలమంది ఆకలితో అలమటిస్తున్నారని చెబుతూ జిమ్మీ జిమ్మీ పాటనే సెటైరిక్‌గా జియ్ మీ జియ్ మీ అంటూ పాడేసుకుంటున్నారు. చైనాలో నిరసనకు బప్పీలహరి పాట థీమ్‌గా మారిపోయింది. మామూలుగా అయితే అక్కడి ప్రభుత్వం ఈ తరహా నిరసనల గొంతు నొక్కేస్తుంది. కానీ అసలే ఫ్రస్టేషన్‌లో ఉన్నారని వదిలేస్తోంది. దీంతో జియ్ మీ జియ్ మీ ఆజా ఆజా అంటూ చిన్నాపెద్దా అంతా రెచ్చిపోతున్నారక్కడ!