కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ ఇప్పుడు తెలంగాణలోనే హడావుడి చేస్తున్నారు. గత ఎన్నికల తర్వాత అమెరికా వెళ్లిపోయి.. ఈ ఎన్నికలకు ఏడాది ముందే రంగలోకి దిగారు. అమెరికాలో ఏ పనులూ లేనట్లు.. ఇక్కడేదో తనకు పెద్ద పని ఉన్నట్లుగా వచ్చి హడావుడి ప్రారంభించారు. పెద్ద ఇల్లు తీుకుని కొత్త కార్ల కాన్వాయ్‌తో బయలుదేరుతున్నారు. ఆయన ఏపీ వైపు చూడటం లేదు. తెలంగాలోనే తిరుగుతున్నారు. తాజాగా అమిత్ షాతో కూడా భేటీ అయి.. కేసీఆర్, కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఆయన తెలంగాణలో రాజకీయం ప్రారంభించినప్పటి నుండి బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నారు.
గవర్నర్ తమిళిశైతో కేఏ పాల్ వరుస భేటీలు !
కేఏ పాల్ అమెరికా నుంచి వచ్చి తెలంగాణలో రాజకీయం చేయాలనుకున్నారు. ఎవరో చెప్పినట్లుగా నేరుగా హైదరాబాద్ లోనే ల్యాండయ్యారు. తర్వాత గవర్నర్ తమిళిశైని కలిశారు. కేసీఆర్ జైలుకెళ్తారని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఆ తర్వాత రెండు మూడు సార్లు గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత నుంచి ఆయన దూకుడు ప్రారంభమైంది. ప్రెస్ మీట్లు పెట్టి తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తానని ప్రకటించారు. కేటీఆర్ తనను ప్రత్యర్థిగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడు అమిత్ షాతో భేటీ !
తెలంగాణలో అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తనపై దాడులు చేయిస్తున్నారంటూ, ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. చాలా మంది అమిత్ షాతో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తారు కానీ దొరకడం కష్టం. కానీ కేఏపాల్ ఇలా ఢిల్లీ వెళ్లగానే అలా అపాయింట్ మెంట్ దొరికింది. తెలంగాణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, అలాంటి స్థాయిలో తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. అమిత్ షాతో తాను అనేక విషయాలను చర్చించానని చెప్పారు. కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాలు వారి దాడులు, రూ.లక్షల కోట్లు మాయమయ్యాయని ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. షాతో భేటీ తర్వాత కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో సహజంగానే మీడియా ప్రాదాన్యం ఇచ్చింది.
పాల్‌కు డైరక్షన్స్ బీజేపీనే ఇస్తోందా ?
కేఏ పాల్ అమెరికా నుంచి సరాసరిన వచ్చి హైదరాబాద్‌లోనే దిగిపోయారు. ఎందుకు తెలంగాణను ఎంపిక చేసుకున్నారో రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు. ఆయనను సీరియస్‌గా తీసుకుని టీఆర్ఎస్ నేతలు ఆయనపై దాడికి పాల్పడటం ఆయనకు మరింత ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. తనపై దాడి విషయాన్ని చెప్పుకోవడానికి సమయం అడిగితే అమిత్ షా వెంటనే ఇచ్చేశారు. దీంతో పాల్ వెనుక బీజేపీ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలనుకుంటున్న బీజేపీ ఓటు సమీకరణాలు లెక్కలో వేసుకుంటోంది. తాము సాధించే ఓట్లతో పాటు ప్రత్యర్థులు సాధించే ఓట్లను కూడా చీల్చడం విజయానికి కీలకం. ఈ ప్రకారం టీఆర్ఎస్‌కు మద్దతిచ్చి క్రిస్టియన్ మైనార్టీ ఓట్లను చీల్చడానికి పాల్‌ను బీజేపీ ప్రయోగిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎలా లేదన్నా.. పాల్ మత ప్రచారకుడు. ఆయన ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.
పాల్ లాంటి వారితో ఓట్ల చీలిక వ్యూహం !
పాల్ లాంటి వారు నియోజకవర్గానికి ఐదు వందల ఓట్లు చీల్చినా బీజేపీకి లాభమే. ఆ మేరకు టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ తగ్గుతుంది. బీజేపీ ఒక్క పాల్ మీదే ఆధారపడటం లేదు. ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అందుకే పాల్ చేసే సాయం కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎలాగైనా పాల్ ఈ సారి కేసీఆర్‌ను చిరాకు పెట్టాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయం ఊహించని వ్యూహాలతో సాగుతోంది.