కాంతార..ఊపేసిన పాటకు ఒరిజనల్ అదేనా?.. ఒకప్పుడు ఏం పిల్లడో ఎల్దమొస్తవా…ఆ మధ్య సారంగదరియా..చెప్పుకుంటూపోతే సవాలక్ష. సిన్మా ఇండస్ట్రీలో ఆ స్టోరీ మాదనో, ఈ పాటకి మొదట ట్యూన్ కట్టింది మేమేననో ఏదో ఒక వివాదం సర్వసాధారణమైపోతుంది. ఎక్కడో చోట ఎత్తేయకుండా, అనుకరించకుండా సిన్మాలు తీసే పరిస్థితి లేదన్నది ఓపెన్ సీక్రెట్. అయితే కన్నడనాట టన్నులు టన్నులు టాలెంట్ ఉందనే విషయం కాంతారతో మరోసారి సినీ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కాంతార కలెక్షన్ల జాతర చేస్తోంది.
అంతా బానే ఉంది. కన్నడనాటే కాదు డబ్బింగ్లోనూ ఈ సిన్మాకి ఎదురులేకుండా పోయింది. తెలుగులో కూడా కాసులవర్షం కురుస్తోంది. కాంతార కల్పిత కథలా ఉండదు. అంత సహజంగా చిత్రీకరించారు దాన్ని. ఈ సిన్మాకే హైలెట్‌గా నిలిచింది ‘వరాహ రూపం.. దైవ వరిష్ఠం..’ పాట. అయితే ఇప్పుడు ఈ పాటమీదే వివాదం రాజుకుంది. వరాహ రూపం పాటను కాపీ చేశారంటూ కేరళ సంగీత బృందం తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపణలు చేసింది. తమ ట్రూప్కి చెందిన నవరసం పాటని కాపీ చేశారంటూ తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపిస్తోంది.
మక్కీకిమక్కీ కాదు. అయితే తాము రూపొందించిన నవరసం పాటలాగే వరాహరూపం ఉందనేది తైక్కుడం బ్రిడ్జ్ వాదన. తమ అనుమతి లేకుండా ఇలా కంపోజ్ చేయడం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమేనంటోంది. దీనిమీద లీగల్ యాక్షన్‌కి రెడీ అవుతోంది. తమ శ్రోతలంతా మద్దతివ్వాలని అభ్యర్థించింది. కాంతార నిర్మాత, సంగీత దర్శకుడు, దర్శకులకు ఈ పోస్ట్‌ని ట్యాగ్ చేసింది. ఈ మ్యూజిక్ బ్యాండ్ ఐదారేళ్ల క్రితమే నవరసం పేరుతో పాటను రిలీజ్ చేసింది. ఈ పాటకి 42లక్షలపైనే వ్యూస్ ఉన్నాయి.
తాను ట్యూన్‌ని కాపీ కొట్టలేదంటున్నారు కాంతార సంగీత దర్శకుడు. రెండు పాటల్లో ఒకే రాగం ఉపయోగించడం వల్ల సారూప్యత కనిపిస్తోందని అంటున్నారు. కొత్తగా ఓ పాటమీద వివాదం తలెత్తినంత మాత్రాన కాంతారకు వచ్చిన నష్టమేంలేదు. ఇప్పటికే దేశమంతా ఆడేసింది. రూ.200 కోట్ల దాకా కలెక్టన్లు కొల్లగొట్టింది. క్రెడిట్ ఇవ్వలేదన్నదే తైక్కుడం బ్రిడ్జ్ ప్రధాన ఆరోపణ కాబట్టి ఇచ్చిపుచ్చుకుంటే ఏ గొడవా ఉండదు. థియేటర్లలో జనానికి పూనకం తెప్పిస్తున్న సిన్మాకి ఈ మాత్రం దిష్టిచుక్కలు లేకపోతే ఎట్లా!