ఆ పాట లేదు..కాంతార జోరు తగ్గుతుందా!
ఆ సిన్మా థియేటర్లకే పూనకం తెప్పిస్తోంది. ఆడియెన్స్‌ని కన్నార్పకుండా చేస్తోంది. కన్నడ సిన్మా దేశంలో కొత్త రికార్డులు కొల్లగొడుతోంది. మిగతా భాషల సిన్మాలకు ల్యాండ్‌మార్క్ పెట్టింది. కాంతారలాంటి సిన్మా తీయగలమా, అలాంటి సిన్మాను మరిపించాలంటే ఇంకెలా తీయాలన్న చర్చ మొదలైంది. ఇరుగుదిష్టి పొరుగుదిష్టి అన్నట్టు మొత్తానికి సెన్సేషనల్ మూవీకి ఓ షాక్ తగిలింది.
భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన కాంతార సిన్మాలో వరాహ రూపం పాట హైలైట్. దాని మ్యూజిక్, చిత్రీకరించిన విధానం భావోద్వేగంగా ఉంటుంది. అయితే ఆ పాటను ఇక ప్రదర్శించకూడదంటూ కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది. తమ నవరసం ఆల్బమ్‌ని కాపీ కొట్టి వరాహ రూపం తీశారని కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పాటను ప్రదర్శించవద్దని ఆదేశాలిచ్చింది.
తైక్కుడం బ్రిడ్జ్ అనుమతి లేకుండా సిన్మాహాళ్లలోనే కాకుండా యూట్యూబ్, ఇతర మ్యూజిక్స్ యాప్స్‌లోనూ వరాహ రూపం ప్రదర్శించకూడదని కోర్టు ఆదేశించింది. ప్రకృతికి మనిషికి మధ్య ఉండాల్సిన సంబంధాలని తెలుపుతూ తీసిన కాంతారలో వరాహ రూపం పాట అందరినీ ఆకట్టుకుంది. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో వచ్చే ఈ పాట ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో రిషబ్ యాక్టింగ్‌కి ఈ పాట తోడవ్వటంతో ఆ సన్నివేశాలు సిన్మాని ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఇప్పుడా పాట లేని సిన్మాలో ఎమోషన్ కాస్త తగ్గినట్లే. ఈ దెబ్బతో కాంతార హ్యాంగోవర్ కాస్త తగ్గుతుందేమో మరి!