పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఒక్కక్కరుగా పార్టీ నుంచి జారుకుంటున్న వేళ.. కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగిలింది. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన జీ-23లో ఒకరైన కపిల్ సిబల్… పార్టీకి గుడ్ బై చెప్పారు. చాన్నాళ్లుగా ఆయన కాంగ్రెస్‌ను వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కాలంగా ఆయన్ను వదిలించుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాను తలచినదీ.. పార్టీ కోరుకున్నదీ అదే కావడంతో సిబల్ నిష్క్రమణకు అంత ప్రాధాన్యం లభించలేదని ఎవరైనా అనుకుంటే పొరపాటే. మూడు దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. పైగా కాంగ్రెస్ లీగల్ టీమ్‌లో సిబల్ అత్యంత ముఖ్యమైన న్యాయవాది.. అనేక సందర్భాల్లో తన వాదనలతో పార్టీని గట్టెక్కించిన ఘనత కూడా ఆయనదే..
వరుసగా ఔట్ గోయింగ్
పంజాబ్ కాంగ్రెస్ నేత సునిల్ జాఖర్.. పార్టీని వీడి ఇంకా వారం కాలేదు. అంతలోనే కపిల్ సిబల్ రూపంలో మరో దెబ్బ తగిలింది. ఆయన కుటుంబంలోని మూడు తరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలందించినప్పటికీ ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలతో కలత చెందినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా.. కాంగ్రెస్ యువరాజును కారు ఎక్కించుకుని వెళ్లిన నేతగా జాఖర్ చిరపరిచితుడు. అలాంటి వ్యక్తి.. పార్టీని విడనాడటమే కాకుండా తక్షణమే బీజేపీలో చేరారు. గుజరాత్ పాటిదార్ నేత హార్దిక్ పటేల్ కూడా ఇటీవలే పార్టీని వీడారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఆయన మూడేళ్లుగా పార్టీలో కీలక బాధ్యతల్లో కొనసాగారు. సోనియా, రాహుల్ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేసిన హార్దిక్ …అసలు దేశాన్ని పీడిస్తున్న సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కూడా ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వని కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకొని గౌరవప్రదంగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆర్‌పీఎన్ సింగ్.. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీకి రాజీనామా సమర్పించారు. 32 ఏళ్ల పాటు పార్టీలో పనిచేసిన ఆర్‌పీఎన్‌సింగ్.. అప్పుడున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదని వ్యాఖ్యానించారు. పైగా ఆర్పీఎన్ సింగ్… కాంగ్రెస్ మాజీ అధ్యక్షు డు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పేవారు. అంతకంటే కొన్ని రోజుల ముందు జితిన్ ప్రసాద కూడా వెళ్లిపోయారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. సచిన్ పైలట్ కూడా వెళ్లిపోవాల్సిన తరుణంలో అతి కష్టం మీద ఆయన్ను ఆపగలిగారు.
లీగల్ టీమ్‌లో కీలకం
కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. బొగ్గు స్కాంలో ఆయన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తరపున సుప్రీం కోర్టులో వాదించారు. కర్ణాటక, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలో పడిపోయి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు కోర్టులో వాదించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాం వచ్చిన్పపుడు వాదించిందీ కపిల్ సిబలేనని మరిచిపోకూడదు.. ఆర్టికల్ 370 రద్దు కేసు, వ్యాపం స్కాం, ట్రిపుల్ తలాఖ్ కేసుల్లో ఆయన వాదించడం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్‌గా మారింది. ఇక పౌరసత్వ సవరణ చట్టం, మరాఠా కోటా చివరకు జహంగీర్‌పూర్ కూల్చివేతల కేసుల్లో కూడా ఆయనే కీలక న్యాయవాది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడైన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై వచ్చిన మైనింగ్ కేసులో కూడా ఆయన తరపున కపిల్ సిబల్ వాదించారు. కాంగ్రెస్ నుంచి సిబల్ నిష్క్రమణతో పార్టీ లీగల్ టీమ్‌పై మరింత భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది..
రాజ్యసభకు..
సమాజ్ వాదీ పార్టీ తరపున సిబల్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. సభలో ఆయన బీజేపీపై విరుచుకుపడతారా.. కాంగ్రెస్‌ను విమర్శిస్తారా తెలియాల్సి ఉంది…