టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత దాదాపుగా మూడేళ్ల తర్వాత పూర్తి స్థాయి పొలిటికల్ ఫైర్ చూపిస్తున్నారు. ఓ వైపు నిజామాబాద్‌లో అర్వింద్‌ను విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. మరో వైపు జాతీయ స్థాయి బీజేపీ నేతలు తెలంగాణకు ఎవరు వచ్చినా సూటిగా సుత్తి లేకుండా నిలదీస్తున్నారు. తాజాగా అమిత్ షా పర్యటన సందర్భంగానూ అదే రీతిని ప్రస్నించారు. తెలంగాణపై కేంద్రం వివక్షను బయట పెట్టారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష పై కవిత ప్రశ్నల వర్షం !
కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తమ మిత్రపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓ రకంగా వ్యవహరిస్తుంది. తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉంటే మరో రకంగా వ్యవహరిస్తుంది. దానికి తెలంగాణనే సాక్ష్యం. కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో రకాల నిధులు ఆగిపోయాయి. వాటన్నింటినీ అమిత్ షా తెలంగాణకు వస్తున్న సందర్భంగా ట్విట్టర్‌లో కవిత బయట పెట్టారు. ఆర్థిక సంఘం నిధుల దగ్గర్నుంచి నీతి ఆయోగ్ సిఫారసు చేసినా మిషన్ భగీరథ, కాళేశ్వరంకు ఇవ్వని నిధుల వరకూ అన్నింటినీ ప్రస్తావించారు. కవిత చేసిన ట్వీట్ వైరల్ అయింది.
నిజామాబాద్ ఎంపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా రాజకీయ పోరాటం !
ఇప్పటికే నిజామాబాద్ ఎంపీపై విరుచుకుపడుతున్నారు. ఆయన నిర్వాకాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెడుతన్నారు. సమాచారహక్కు చట్టం కింద సేకరించిన పత్రాలను బయట పెట్టి తిప్పికొట్టలేని విధంగా సాధికారికంగా విమర్శలు చేశారు. పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ మోసం చేశారని ప్రజల ముందు పెట్టారు. పసుపు రైతుకు చేసిన సాయం రూ. మూడు వందలని లెక్కలూ బయట పెట్టారు. కవిత ఇలా సాధికారికంగా అన్ని విషయాలు బయట పెట్డడంతో సహజంగానే అంశం వైరల్‌గా మారింది. అసలు సబ్జెక్ట్‌తో పాటు ఇంత కాలం సైలెంట్‌గా ఉన్న కవిత ఒక్క సారిగా యాక్టివ్ కావడావికి కారణం ఏమిటన్న చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది.
మళ్లీ నిజామాబాద్ ఎంపీ స్థానానికి గురి పెట్టారా ?
నిజామాబాద్‌లో కవిత ఎంపీగా ఓడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. మరోసారి కవిత ఓటమితో అది నిరూపితమైంది. నిజామాబాద్ ప్రజలకు ఐదేళ్లలో ఎన్నో చేశానని పసుపుబోర్డు కోసం తాను చేసిన ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేశానని ఆమె అనుకున్నారు. అందుకే ఓటమితో ఆమె ఫీలయ్యారు. తర్వాత తన రాజకీయ భవిష్యత్‌పై అనేక చర్చలు జరిగాయి. చివరికి నిజామాబాద్ నుంచే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎన్నికయ్యారు. కానీ ఆ పదవి ఆమె స్థాయికి తగినది కాదని టీఆర్ఎస్‌లో ఓ బలమైన ప్రచారం ఉంది. కానీ కవిత సర్దుకోక తప్పలేదు. ఇంత కాలం ఏం జరిగినా ఇక నుంచి మళ్లీ నిజామాబాద్ ఎంపీ స్థానంపైనే గురి పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ముందుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాధ్యత మొత్తం తీసుకుని అభ్యర్థుల్ని గెలిపించేందుకు రంగంలోకి దిగినట్లుగా భావిస్తోంది. ఈ మేరకు కేసీఆర్ నుంచి స్పష్టమైన సూచనలు రావడంతోనే పొలిటికల్ యాక్షన్ ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు.
సింగరేణిలోనూ మళ్లీ ప్రత్యక్ష పాత్ర !
నిజామాబాద్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి తెర వెనుకే ఉన్నారు. ప్రజల్లోకి రావాల్సిన అవసరం కనిపించలేదు. ముందస్తు ఎన్నికలకు ముందు కవిత పలు కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పాటు దగ్గరనుంచి గుర్తింపు సంఘంగా మార్చే వరకూ.. కవిత కృషి చేశారు. గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే.. ఎన్నికలకు ముందు.. అన్ని కార్మిక సంఘాల గౌరవ అధ్యక్ష బాధ్యతల నుంచి టీఆర్ఎస్ నేతలను వైదొలగాలని కేసీఆర్ ఆదేశించారు. అప్పుడు రాజీనామా చేశారు. కానీ ఇటీవల మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. ఇతర విషయాల్లోనూ యాక్టివ్ అవుతున్నారు. అంటే.. మళ్లీ రాజకీయంగానూ కవిత స్పష్టమైన లక్ష్యంతో అడుగు ముందుకేస్తున్నారని భావించవచ్చు.
కేసీఆర్‌కు తోడుగా జాతీయ రాజకీయాల్లోనే !
కవిత తెలంగాణ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారని.. ఆమె మంత్రి అవుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆమె తన రాజకీయ పయనాన్ని ఢిల్లీ వైపే నిర్ణయించుకున్నారని భావిస్తున్నారు. కేసీఆర్ జాతీయ పర్యటనల్లో ఆయన వెంటే ఉంటున్నారు. కేసీఆర్ ఢిల్లీ రాజకీయ ప్రణాళికలు అన్నీ కవిత సమక్షంలోనే సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఏం చేయాలి.. ఎలా చేయాలన్నదానిపై ప్లాన్ కేసీఆర్ సిద్ధం చేస్తే కవిత అమలు చేస్తున్నారు. కవిత చురుగ్గా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారు. పలువురు ఉత్తరాది పార్టీ నేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతను కూడా కవితకు కేసీఆర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్టు సంజయ్ కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పనిచేసేలా ప్రజాసంబంధాల అధికారిగా నియమించింది. సంజయ్ నియామకం, ఎంపికలో కవిత క్రియాశీలంగా వ్యవహరించారు.
కవిత .. తండ్రికి తగ్గ తనయ. కేసీఆర్ స్పీచ్‌లకు ఏ మాత్రం తగ్గకుండా వాగ్దాటి ఉంటుంది. ఏ విషయంపైనైనా సాధికారికంగా మాట్లాడగలరు. మహిళల్లో మంచి ఆదరణ ఉంది. కవిత మళ్లీ రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తే టీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుందని ఆ పార్టీ క్యాడర్ నమ్ముతున్నారు. ఆ దిశగా కవిత కూడా సంకేతాలు పంపారని అనుకోవచ్చు.