ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత…మరోసారి లోక్ సభకు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆమె…రెండోసారి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. గతంలో గెలుపొందిన నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
ఎమ్మెల్సీ కవిత… నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని ఫిక్సయిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కవితకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కవిత ఓడిపోవడంతో… టీఆర్ఎస్ పార్టీ అధినేత అలర్ట్ అయ్యారు. నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో… నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాట్టారు. అన్ని చోట్ల గులాబీ పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. ఏడింట క్లీన్ స్వీప్ చేయడంతో…టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల ప్రకారం…నిజామాబాద్ పార్లమెంట్ లో కవితనే గెలుపొందాలి. ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ… ముఖ్యమంత్రి కూతురు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. 2019 ఓటమికి బదులు తీర్చుకోవాలన్న కసితో పని చేస్తున్నారు కవిత. 2024 ఎన్నికల కోసం నిజామాబాద్ ప్రజలతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్…సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నివేదికలు తెప్పించుకోవడంతో…నేతలు లోలోపల వణికిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు వస్తుందో రాదోనన్న భయంలో ఉన్నారు. ఏదో రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూనే…ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోవడం లేదు.