తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన ఖాళీగా ఉండే రాజకీయ నాయకుడు కాదు. బయటకు చేయాల్సినవి బయట చేస్తారు. అంతర్గతంగా చేయాల్సినవి అంతర్గతంగా చేస్తారు. అటు ఉద్యమంలో అయినా ఇటు రాజకీయంలో అయినా కేసీఆర్ ఏం చేయాలో.. ఎలా చేయాలో డిసైడ్ చేస్తారు. ఆయన బాధ్యతలు అప్పగించిన వ్యక్తులు పూర్తి చేస్తారు. మొదటి నుంచి జరుగుతోంది ఇదే. ఇప్పుడు ఢిల్లీ రాజకీయంలోనూ అదే జరుగుతోంది. అయితే కేసీఆర్ ఢిల్లీలో బాధ్యతలు అప్పగించింది ఎవరికో కాదు.. కుమార్తె కల్వకుంట్ల కవితకే.. !
టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల “వర్కింగ్ ప్రెసిడెంట్” గా కవిత !
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ బాధ్యత మొత్తం కేటీఆర్ చూసుకుంటున్నారు. ఆయనకు అధికారికంగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఉంది. కవితకు ఆ హోదా లేకపోయినా జాతీయ రాజకీయాలకు సంబంధించినత వరకూ ఆమెనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రస్తుత పరిణామాలు ఆమె నిర్వర్తిస్తున్న బాధ్యతలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పుడు తండ్రి వెంటే ఉంటున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయ వ్యవహారాలను ఆమె సమన్వయం చేస్తున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ తదుపరి కార్యాచరణ ఏమిటి.. ఎలా చేయాలన్నదానిపై ప్లాన్ సిద్ధం చేస్తే కవిత అమలు చేస్తున్నారు. కవిత చురుగ్గా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారు. సమాజ్ వాదీ నేత అఖిలేశ్‌తో సంప్రదింపుల బాధ్యతను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకున్నారు. చర్చలు జరుపుతున్నారు.
ప్రతీ టూర్‌కూ కేసీఆర్ వెంటే కవిత !
ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలు, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌తోపాటు వెళ్తున్నరారు. కవిత గతంలో ఎంపీగా చేసిన అనుభవం ఉంది. దాదాపుగా అన్ని పార్టీల జాతీయ నేతలతో దగ్గరి పరిచయాలు ఉన్నాయి. కేసీఆర్ కుమార్తెగా పలుకుబడి కూడా ఉంది. అందుకే జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ముంబై, ఢిల్లీ, జార్ఖండ్ పర్యటనల్లోనూ కవిత సీఎం వెంటే ఉన్నారు. మరోవైపు కేసీఆర్‌తోపాటు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కవిత తన బృందంతో కలిసి జాతీయస్థాయి మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లతో వరుస భేటీలు జరుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
హిందీ బెల్ట్‌లో టీఆర్ఎస్‌కు ప్రచారం కల్పించే బాధ్యతలూ తీసుకున్న కవిత !
కేసీఆర్ జాతీయ నాయకుడు అవ్వాలంటే ముందుగా హిందీ ప్రజలకు పరిచయం కావాలి. అక్కడ మీడియాలో ప్రముఖులవ్వాలి. ఇప్పటి వరకూ తెలంగాణ సీఎంగా అక్కడి ప్రజలకు తెలుసు. కానీ రైతు ఉద్యమనాయకుడిగా ఇమేజ‌్ కావాలి. ఆ ప్రయత్నాలను కవిత చేస్తున్నారు. ఇటీవల సీనియర్ జర్నలిస్టు సంజయ్ కుమార్ ఝాను ఢిల్లీ కేంద్రంగా పనిచేసేలా ప్రజాసంబంధాల అధికారిగా నియమించారు.. ఈయనను నియామకాన్ని కవితనే ఖరారు ఖరారు చేశారు. కవిత రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారని.. మంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగిదంి. కానీ ఆమె కేసీఆర్ జాతీయ రాజకీయాల సమన్వయ బాధ్యతలు తీసుకున్నట్లుగా క్లారిటీకి రావొచ్చు. కవిత రాజకీయ సామర్థ్యంపై ఎవరికీ డౌట్ లేదు. ఉద్యమంలో జాగృతి పేరుతో ఆమె నిర్వహించిన కార్యకలాపాలు ఆ తర్వాత సింగరేణి కార్మికల సంఘాలను ఏకం చేయడం దగ్గర్నుంచి ఎంపీగా విధి నిర్వహణ వరకూ తండ్రికి తగ్గ కుమార్తెగానే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కవిత మరోసారి జాతీయ స్థాయిలో హైలెట్ కావడం ఖాయమని అనుకోవచ్చు.