రాముడి రాజకీయానికి విరుగుడుగా హనుమాన్ ! కవిత కౌంటర్‌ ప్లాన్‌తో బీజేపీకి షాక్ !

By KTV Telugu On 22 May, 2022
image

రాజకీయం అంటే రాజకీయం. అందులోకి మతాలను చొప్పిస్తే ప్రమాదకరం. దేవుడ్ని తీసుకొస్తే ఇంకా ప్రమాదకరం. ఇలాంటి రాజకీయాలు చేయడంలో బీజేపీది అందే వేసిన చేయి. రాజకీయ ప్రత్యర్థులు ఎక్కడ కనిపించినా జైశ్రీరాం అని నినాదాలిస్తూంటారు. అది దేవుడి నినాదం అయినా రాజకీయ ప్రత్యర్థులు కనబడినప్పుడల్లా ఆ నినాదాలు చేసి.. రెచ్చగొడుతూ ఉంటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకూ ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే నిజామాబాద్‌లో ఆమె ప్రత్యర్తి  బీజేపీ నేతే. దీనికి విరుగుడుగా కవిత మరో స్లోగన్ కనిపెట్టారు. దాన్ని కార్యకర్తలకూ వివరించారు. బీజేపీ నేతలు తమను రెచ్చగొట్టేందుకు జైశ్రీరాం అని నినాదాలు ఇస్తున్నారని.. వారు అలా అంటే మనం జై హనుమాన్ అనాలని ఎమ్మెల్సీ ‌కవిత టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కొండగట్టు ఆంజనేయుడి భక్తురాలిగా కవిత !

తెలంగాణ రాష్ట్ర సమితి వారసుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న కల్వకుంట్ల కవిత రాజకీయ వ్యూహాల్లోనూ ఆ నేర్పరితనం చూపిస్తున్నారు. రాజకీయాన్ని కొద్ది కొద్దిగా మారుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభావాన్ని.. వారి మత రాజకీయాల ప్రభావాన్ని… ప్రజల్లో పెరుగుతున్న హిందూత్వ భావనకు తగ్గట్లుగానే రాజకీయ వ్యూహాలు మార్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో పక్కా హిందూత్వ వాదాన్ని వినిపించడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీది జై శ్రీరాం నినాదం అయితే… కవిత జైశ్రీరాంతో పాటు జైహనుమాన్ నినాదం కూడా వినిపిస్తున్నారు. కొంతకాలంగా కొండగట్టు ఆంజనేయుడ్ని కవిత వరుసగా దర్శించుకుంటున్నారు. కొండ గట్టు వెళ్లినప్పుడల్లా జైశ్రీరాం, జైహనుమాన్ అంటూ నినాదాలు చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. తాజాగా కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన తర్వాతే పలు కార్యక్రమాలకు హాజరువుతున్నారు.

జై హనుమాన్ ప్రత్యేక కార్యక్రమాలనూ సిద్ధం చేసిన కవిత ! .

జై హనుమాన్ నినాదాలతోనే కవిత సరిపెట్టుకోవడం లేదు. ప్రత్యేక కార్యకర్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. కొండగట్టులోనే రామకోటి స్థూపాన్ని నిర్మిస్తున్నారు. ఇందు కోసం గతంలోనే  భూమి పూజచేశారు. మార్చి 17న హనుమాన్ పారాయణం ప్రారంభించారు. ఇది  జూన్ 4 వరకు సాగుతుంది. ఒక్క కొండ గట్టు మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో ఆలయాలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమానికి పిలుపులు వచ్చినా వెళ్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గంలోని నవీపేట్‌ మండలం జాన్నేపల్లిలో పురాతన శివాలయం పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి కవిత వెళ్లిన తీరు మీడియాలో హైలెట్ అయింది. ఆ శివాలయాన్ని మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన ట్రస్ట్ పేరుతో రూ. కోటి వరకూ ఖర్చు చేసి అభివృద్ధి చేశారు.

టీఆర్ఎస్‌లో హిందూత్వ వాదిగా పేరు !

యాగాలు, యజ్ఞాలతో కేసీఆర్‌కు హిందూ సమాజంలో మంచి పేరు ఉంది. అయితే రాజకీయ పరిమితుల దృష్ట్యా కేవలం హిందూత్వ వాదిగా ఆయనను తీర్చిదిద్దుకోవడం కష్టం. రాజకీయాల పరంగా ఆయన మజ్లిస్‌ను దగ్గరగా తీసుకోవడం.. బీజేపీ నేతలకు అడ్వాంటేజ్‌గా మారింది. దీనికి విరుగుడుగా కవిత బీజేపీకి హిందూత్వా రాజకీయాలతో కౌంటర్ ఇస్తున్నారు.  దేవుడి పేరుతో రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరికలు పంపుతున్నారు. బీజేపీ మార్క్ హిందూత్వ వాదనకు… హనుమాన్ అస్త్రంతో చెక్ పెట్టాలని కవిత గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  బీజేపీ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. పెట్రోల్ నుండి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అందరి అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయల లాంటి హామీలు ఇచ్చి మోసం చేశారని.. కానీ ఇప్పుడు దేవుడి పేరుతో మోసం చేయడానికి వస్తున్నారని కవిత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముల్లును ముల్లుతోనే తీయాలనేది సిద్ధాంతం. రాజకీయమైనా అంతే. ఇప్పుడు బీజేపీ మార్క్ హిందూత్వ రాజకీయాలకు అదే విధంగా కౌంటర్ ఇవ్వాలని కవిత ప్రయత్నిస్తున్నారు. తొలి అడుగు విజయవంతంగా వేశారు.. బీజేపీ తరహాలోనే దూకుడు చూపిస్తే.. వారికి పర్ ఫెక్ట్ కౌంటర్ ఇచ్చినట్లవుతుంది.