‘‘కేసీఆర్ ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరం లేదు.. బండి సంజయ్ చాలు.. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆయన పాదయాత్ర చేశారు.’’ ఇదీ తుక్కుగూడ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పవర్ ఫుల్ డైలాగ్.. ఆ మాటలో ఎన్నో అర్థాలున్నా.. అన్నింటికీ మించిన మీనింగ్ మరోకటి ఉంది. బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు సమాధానం అందులో నిక్షిప్తమై ఉంది. పార్టీలోనూ, బయట సంజయ్ ప్రత్యర్థులకు అమిత్ షా నేరుగానే సందేశం ఇచ్చారు. తెలంగాణ బీజేపీలో గెలిస్తే బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పకనే చెప్పారు…
కాంగ్రెస్ పార్టీకి రేవంత్
ప్రాంతీయ పార్టీలకు పార్టీ అధినాయకుడే ముఖ్యమంత్రి అభ్యర్థి.. పార్టీ అధికారంలో ఉంటే అప్పుడున్న ముఖ్యమంత్రే తదుపరి ఎన్నికలకు కూడా సీఎం అభ్యర్థిగా ఉంటారు. తెలంగాణలోనూ అంతే. కేసీఆర్ ఇప్పటికిప్పుడు కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప ఆయనే సీఎం అభ్యర్థి. నిజానికి జాతీయ పార్టీలు ఎన్నికల ముందు సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో ఎన్నడూ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో సీఎం అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ సారి కూడా నేరుగా ప్రకటించకపోయినా… అభ్యర్థులు వీరేనని బలమైన సంకేతాలిచ్చారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లంతా వెళ్లి టీఆర్ఎస్ లో కలిసిపోవచ్చని రాహుల్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని ఆయన ప్రకటించడం రెబెల్స్ ను దారికి తెచ్చే ప్రయత్నంగానే భావించాలి. దానితో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్లయ్యింది..
వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు భాషపైనా పట్టు ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఉంది. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అన్ని పథకాల సమాచారం ఆయనకు కొట్టిన పిండి. ఏ అంశంపైనేనా ఆయన అనర్గళంగా మాట్లాడతారు. స్పీచ్ మొదలెట్టారంటే.. ప్రత్యర్థులను ఉతికి ఆరేస్తారు. కేసీఆర్ స్పీడ్ వినేందుకు లక్షల మంది ప్రేక్షకులు తరలి వస్తారు. ప్రతీ ఇంట్లో జనం టీవీలకు అతుక్కుపోతారు. మరో పక్క ప్రత్యర్థులు కూడా ఏమీ తీసిపోలేదు. రేవంత్ డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉంటుంది. టీఆర్ఎస్, బీజేపీలపై ఆయన నిత్యం అటాకింగ్ మూడ్ లో ఉంటారు. ఇక బండి సంజయ్ కుమార్.. ఇప్పుడు బీజేపీలో రైజింగ్ స్టార్. ఆయన రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీకి కొత్త జోష్ వచ్చింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సంజయ్ తెలంగాణ జనం సింపథీ కోసం ప్రయత్నిస్తున్నారు….
అభ్యర్థులే ముఖ్యమా…
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పార్టీల కంటే సీఎం అభ్యర్థుల చుట్టూనే రాజకీయం తిరిగే అవకాశం ఉంది. అభ్యర్థి జనానికి నచ్చితే… ఆ పార్టీకే ఓటేస్తారు. కేసీఆర్ పదేళ్ల పాలన జనానికి నచ్చితే… ఆయన వైపే మొగ్గుచూపుతారు. చిన్న తప్పిదాలను జనం పెద్దగా పట్టించుకోరనే అనుకోవాలి. పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలతో పనిలేకుండా కేసీఆర్ ను చూసి ఓటెయ్యడానికే జనం మొగ్గుచూపుతారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. లేట్ గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా జనాన్ని తెగ ఆకట్టుకుంటున్న రేవంత్ రెడ్డికి ఉన్న పరపతి కాంగ్రెస్ లో ఇతర నాయకులకు లేదు. బీజేపీలో బండి సంజయ్ వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తున్నారు. ఇతరులు ఉన్నారా లేరా అన్నట్లుగా పరిస్థితి తయారైంది…
అసమ్మతి ఉంటుందా..
రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చేనాటికి కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లున్నారు. పార్టీ గెలిస్తే తామే ముఖ్యమంత్రులమని భావించే వారు కనీసం డజను మంది ఉంటారు. వారంతా రేవంత్ దూకుడుతో ఇప్పుడు గత్యంతరం లేని మౌనాన్ని పాటిస్తూ ఆయనకు సహకరిస్తున్నారు ఎన్నికలు దగ్గర పడే నాటికి వాళ్లు కాంగ్రెస్ మార్కు పాలిటిక్స్ ను ప్రదర్శించే అవకాశం ఉంది. బీజేపీలోనూ అంతే.. వాజ్ పేయి, ఆడ్వాణీ కాలంలో బీజేపీలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ నేతలు ఇప్పుడు పక్కన నిల్చునే పరిస్థితి వచ్చింది. మోదీ, అమిత్ షా వారిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికల నాటికి వారు సంజయ్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయా పార్టీల అధిష్టాన వర్గాలు చేసిన గట్టి హెచ్చరిక వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో..