2018 ముందస్తు ఎన్నికల్లో రైతు బంధుతో విజయాన్ని అందుకున్న కేసీఆర్ ఈసారి దళిత బంధుతో విజయానికి గురి పెట్టారు. దళిత బంధు పథకంతో మూడో సారి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఈ పథకం అమలు విషయంలో కేసీఆర్ ఇప్పటికే ఓ స్పష్టమైన విధానపరమైన నిర్ణయం ప్రకటించారు. నియోజకవర్గానికి వంద మందికి ఇప్పటికే ఇచ్చారు. బడ్జెట్‌లో రూ. 17వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం అమలు జరుగుతూండగానే ఎన్నికలు వస్తాయి. కానీ దళిత బంధు ఓ సారి కడియం శ్రీహరి చెప్పినట్లుగా పులి మీద స్వారి లాంటిదే. !
చెప్పినట్లుగా అందరికీ ఇవ్వకపోతే దళితుల్లో అసంతృప్తి..!
దళిత బంధు పథకాన్ని ఆలస్యం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దళితులకూ పథకాన్ని అందించాల్సి ఉంది. తెలంగాణలో 18శాతం వరకూ ఉన్న దళిత కుటుంబాలు అందరికీ పథకం వర్తింప చేయడం ఆర్థిక పరంగా అసాధ్యమని ప్రభుత్వనికీ తెలుసు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అందరికీ అమలు చేసి, మిగిలిన 118 నియోజకవర్గాల్లో కేవలం 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ ఆర్థిక సంత్సరం నుంచి మిగతా వారికీ ఇస్తారు. దళిత బంధు పథకం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లెక్కల్లో స్పష్టత ఉంది. ఏడేళ్లలో దళిత కుటుంబాలకు రూ. లక్షా 70వేల కోట్లను పంపిణీ చేస్తే వారు రూ. పది లక్షల కోట్లను సంపాదించుకుంటారని పలు సందర్భాల్లో చెప్పారు. ఏడేళ్లలో తెలంగాణ బడ్జెట్ రూ. 23 లక్షల కోట్లు. వాటిలో నుంచి దళితులకు రూ. 1 లక్షా 70వేల కోట్లు కేటాయించడం పెద్ద సమస్యేం కాదని కూడా చెప్పారు. కేసీఆర్ వచ్చే ఏడేళ్ల లెక్క మాత్రమే చెప్పారు. అంటే రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించడం ఖాయమని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారని అనుకోవాలి.
ఇతర వర్గాల్లో అసంతృప్తి రాకుండా చూసుకోవాలి!
ఇప్పటికే దళితేతర వర్గాల నుంచి మాకు కూడా ఓ బంధు కావాల్న డిమాండ్ పెరుగుతోంది. రూ.10 లక్షల చొప్పున నగదు పంపిణీ అనే సరికి ప్రతీ కుటుంబం ఆశ పడటం సహజం. అలాంటి ఆశ అంతకంతకూ కుటుంబాల్లో పెరుగుతోంది. ఇతర రాజకీయ పార్టీలు దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. అంటే… ఇతర వర్గాలకూ ఏదో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టక తప్పదు. వారికి ఎలాంటి లబ్ది చేకూర్చకపోతే.. వారంతా వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంది. వీటన్నింటిని కేసీఆర్ సమర్థంగా డీల్ చేయాల్సి ఉంది. లేకపోతే అన్ని వర్గాలకూ వ్యతిరేకమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒక్క వర్గానికే సాయం చేస్తామంటే ఇతర వర్గాలు అసంతృప్తి చెందుతాయి.. ఆ వర్గానికి పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ఆ లక్ష్యమూ నెరవేరదు.
కేసీఆర్ మేనిఫెస్టోలో హైలెట్ అయ్యేది దళిత బంధునే !
దళిత బంధు ప్రారంభోత్సవ వేదిక మీద కేసీఆర్ ఒకటి రెండు నెలల్లో హుజురాబాద్‌లో దళిత బంధు అమలు పూర్తి చేస్తామన్నారు. మూడు , నాలుగేళ్లలో రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. అంటే.. ఒక్క దళిత బంధు అమలు చేయడానికే మూడు నాలుగేళ్ల పడుతుంది. కానీ రెండేళ్లలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ లెక్కన చూస్తే ఎన్నికల్లోపు దళిత బంధు కూడా పూర్తిగా అమలు కాదు. ఆ విషయంపై ప్రజల్ని కూడా సన్నద్ధం చేస్తారు. ఎలాగూ సీఎం కేసీఆర్‌కు ముందస్తుకు వెళ్లే ఆలోచన ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ముందస్తుకు వెళ్తే.. ఇక బంధు ఒక్కటే ఎన్నికల హామీ.. టాపిక్ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ మాస్టర్ ప్లాన్‌లు ఇలాగే ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయి. దళితులకు మాత్రమేనా మేము పేదలం కాదా అని ఇతర వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీరందరికి పథకం వర్తింప చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంటే వారు నమ్మాలి.. నమ్మి తీరాలి. మరోసారి ఓట్లు వేయాలి. ఓట్లు వేసిన తర్వాతనే మిగిలిన వర్గాలకు బంధు పథకం వస్తుందని కేసీఆర్ ఇప్పటికే పరోక్షంగా చెప్పారు.
కేసీఆర్ రాజకీయ వ్యూహాల సామర్థ్యంపై అందరికీ నమ్మకం ఉంది కానీ.. రాజకీయాల్లో పరిస్థితులు కూడా కలసి రావాలి. లేకపోతే.. అటు దళితులఓట్లు.. ఇటు ఇతర వర్గాల ఓట్లు మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అదే జరిగితే దళిత బంధు కారణగానే ఓడిపోయారని తర్వాత విశ్లేషించుకోవాల్సి వస్తుంది.