కేసీఆర్ చంద్రముఖి గది తలుపు తెరవడం ఖాయం అయిపోయినట్టే ఉంది. రెండు నెలల్లో మీరే చూస్తారంటూ సవాల్ చేశాక ఇలాగే అనిపిస్తోంది. మేడ మీద గది తలుపు కొట్టి చూసి వచ్చాక చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ కీ… రాష్ట్రాలు తిరిగి వచ్చాక కేసీఆర్ కొడుతున్న డైలాగ్ కీ సరిగ్గా పోలిక సరిపోతోంది. అందుకే చంద్రముఖి గది తెరుచుకోబోతోంది అంటున్నది. సినిమాలో చంద్రముఖి గదిలో ఏముందో తెలుసు కానీ రాజకీయాల్లో చంద్రముఖి గది తెరుచుకుంటే ఏమవుతుంది? అసలు ఆ గదిలో ఏముంది?
కేసీఆర్ కొత్త జనతా ప్రయోగం
రాజకీయాల్లో చంద్రముఖి జనతా ప్రయోగం. ఓసారి సక్సెస్ అయ్యింది. అంతలోనే విఫలం అయ్యింది. మళ్లీ పదేళ్లకి బతికి నిలిచింది. కానీ ఎంతో కాలం ఉండలేకపోయింది చాలా మందికి అది గుర్తుంది. కేసీఆర్ కి గుర్తొచ్చినట్టే ఇలా ఉన్నట్టుండి మూడ్ తెస్తుంటుంది ఆ ప్రయోగం. ఇంతకీ ఇప్పుడు జనతా పరివార్ లాంటి ప్రయోగం చేసేందుకు కేసీఆర్ ఎందుకు సిద్ధం అవుతున్నారంటే… కాంగ్రెస్ కొన ఊపిరితో ఉంది. బీజేపీని ఎదిరించే శక్తి ఏ పార్టీకీ లేదు. ప్రాంతీయ శక్తులు ఏకమైతే బలం వస్తుందనే లెక్క బీజేపీ వ్యతిరేక పార్టీల్ని ఏకం చేసే ఎత్తుగడ ! ఇదే కేసీఆర్ పాయింట్. ఇప్పటి ప్రయత్నాలకి జనతా అని పేరు పెట్టకపోవచ్చు. కానీ రూలింగ్ పార్టీ మీద వ్యతిరేకతను కూడగట్టి – రాష్ట్రాల్లోని పార్టీలతో జట్టుకట్టి కేంద్రంలో జెండా ఎగరేయాలన్నది కేసీఆర్ ఐడియా. ఇది కాస్త అటు ఇటుగా జనతా మోడలే !
ప్రాంతీయ పార్టీలను కూడగట్టడం అనేది కప్పలను తక్కెడలో పెట్టడం లాంటిది. కొన్ని కప్పలు తక్కెడలోకి ఎక్కేలోపే మరికొన్ని దూకేస్తాయ్. దిగేస్తాయ్. జేడీఎస్, ఆప్, తృణమూల్, శివసేన, జేఎంఎం పార్టీల్లో ఎవరి లెక్కలు వాళ్లవి. జేడీఎస్, సేన లాంటి పార్టీలు కాంగ్రెస్ ను కాదని బతికే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీల నైజం ఏంటో స్వయంగా రీజినల్ పార్టీని నడిపే కేసీఆర్ కి తెలియంది కాదు. కాకపోతే ఓ ప్రయత్నం చేయాలన్న సంకల్పం కావొచ్చు. పైగా కేంద్రంలో ఏదో చేయబోతున్నారు కేసీఆర్ అనే చర్చ రేకెత్తించి వచ్చే ఏడాది జరిగే తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే ఎత్తుగడ అయ్యుండొచ్చు.
కేసీఆర్ ప్లాన్లు పని చేస్తాయా..
కేసీఆర్ ఢిల్లీని ఏలతా అని అంటున్నాడు.. మన సత్తా – మన ప్రైడ్ లాంటి ఫీలింగ్ ను తట్టిలేపాలన్న ఎత్తుగడ ఉండొచ్చు. కాలం కలిసొస్తే తాను ఢిల్లీ వెళ్లి కేటీఆర్ ను ఇక్కడ కూర్చోబెట్టాలన్న ప్లాన్. మరి ఇలాంటి ఎత్తుగడలు పని చేస్తాయా లేదా చూడాలి ! పైగా ఈలోపు కాంగ్రెస్ లో కదలిక వస్తే, కర్ణాటక – మధ్యప్రదేశ్ లాంటి చోట్ల గెలిస్తే కథే మారిపోవచ్చు. మొత్తానికి కేసీఆర్ అయితే రెడీ అవుతున్నారు. చంద్రముఖి గది తలుపు తెరుస్తా అంటున్నారు.