కౌన్ బనేగా ప్రధానమంత్రి ?

By KTV Telugu On 11 December, 2022
image

మోదీకి పోటీ ఎవరూ. దేశానికి కాబోయే ప్రధాని ఎవరూ. కేజ్రీవాల్ కు ఉన్న అవకాశాలేమిటి ? దూకుడు పెంచిన కేసీఆర్ ప్రధానమంత్రి పీఠంపై కన్నేశారా ? ఉత్తరం, దక్షిణంగా ఉండే ఆలోచనల్లో ఎవరు పైచేయిగా నిలుస్తారు. దేశ ప్రజలు ఎవరి నాయకత్వాన్ని ఆమోదిస్తారు. ఎవరి విధానాలకు జనాకర్షణ కనిపిస్తోంది. వాచ్ దిస్ బిగ్ స్టోరీ ఆన్ కేటీవీ…

ఉద్యమ నేపథ్యంతో విజయం సాధించిన నేతలు.
ఎనిమిదేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవి.
సంక్షేమ పథకాల్లో పోటీ పడుతున్న నేతలు.
ఢిల్లీ ప్రజలకు అత్యంత అభిమాన నేతగా కేజ్రీవాల్.
తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్.
ఢిల్లీలో ఉచిత కరెంట్, తాగునీరు, మహిళలకు ఉచిత ప్రయాణం.
తెలంగాణలో సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్.
జాతీయ పార్టీగా బీఆర్ఎస్.
జాతీయ హోదా పొందిన ఆప్.
ఇద్దరి టార్గెట్ ప్రధాని మోదీ.
బీజేపీకి దేశవ్యాప్తంగా సంస్ఘాగత నిర్మాణం.
తెలంగాణ మినహా దేశంలో ఎక్కడా లేని బీఆర్ఎస్.

వాళ్లిద్దరూ ఉద్యమ పార్టీ నాయకులు. ఉద్యమాన్ని సక్సెస్ చేసిన నేతలు. ఉద్యమంతోనే అధికారానికి వచ్చిన ఒక్కరిద్దరు అసమాన నేతల్లో వారిద్దరూ ఉన్నారు. ఇద్దరూ జనాకర్షణ ఉన్న నాయకులే. ఇప్పుడు ఇద్దరూ ఒకే లక్ష్యం దిశగా దూసుకుపోతున్నారు. అదేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ సింపుల్ గా ఉండే లీడర్స్ జనంలోనే ఉండాలని కోరుకునే నాయకులు. దెబ్బలు తిన్నకొద్దీ రాటు తేలిన నాయకులు వాళ్లు. తొలి దశ తెలంగాణ ఉద్యమం నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేని పరిస్థితుల్లో మలి దశ ఉద్యమాన్ని ప్రారంభించి సక్సెస్ చేసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ జాతిపిత అని కేసీఆర్ ను ఆయన అభిమానులు పిలవడం కొంత విడ్డూరంగా అనిపించినా రక్తపాత రహిత ఉద్యమాన్ని నడిపించిన తీరును మాత్రం ప్రపంచం మెచ్చుకోకుండా ఉండలేదు. దశాబ్దంపైగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరిదాకా తోడు నిలిచిన వాళ్లు తక్కువ మందే ఉన్నా తట్టుకున్నారు. అదుగో ఇదిగో అంటూ సమైక్య పార్టీలు చేసిన ద్రోహాలను ఆయన భరించారు . తన ఎమ్మెల్యేలను చీల్చినా వెనుకంజ వేయలేదు. చివరకు తెలంగాణ సాధించారు. 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. కేజ్రీవాల్ కూడా అంతే. అన్నాహజారే అవినీతి వ్యతిరేకోద్యమంలో చేరిన మాజీ ఐఆర్ఎస్ అధికారి ఆయన. తర్వాత కొందరు భావసారూప్య మిత్రులను కలుపుకుని ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించారు. అప్పటి వరకు అవినీతికి ఆలవాలమైన పార్టీలను మట్టి కరిపించారు. ఢిల్లీలో అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. రాజధాని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేదీ ఆమ్ ఆద్మీ పార్టీయేనని పేరు పొందారు.

కేసీఆర్, కేజ్రీవాల్ ఇద్దరూ దార్శనికులే. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులే. ముందు వెనుకా చూసుకోకుండా సంక్షేమ పథకాలను ప్రకటించే తత్వం వారిది. రాష్ట్రావతరణ తర్వాత పాలనను గాడిలో పెట్టిన ఘనత కేసీఆర్ దేనని చెప్పక తప్పదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సుసంపన్నం చేశారు. సాగునీరు, తాగు నీటికి లోటు లేకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆరే కావచ్చు. కరెంట్ కోతలు కూడా లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ వర్గాలు చెబుతాయి. దళిత బంధు, రైతుల బంధు, డబుల్ బెడ్ రూమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగు నీరు ఉచితంగా అందిస్తున్నారు. మరో పక్క ఢిల్లీలో పేద, మధ్య తరగతి వర్గానికి కేజ్రీవాల్ దేవుడేనని చెప్పాలి. ఆ రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. తాగు నీరు కూడా ఉచితమే. సర్కారీ బడులను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేసి అందులో పేద పిల్లలకు చదువులు చెబుతున్నారు. వాళ్లు ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉత్తీర్థత సాథించేంతగా తర్ఫీదు ఇస్తున్నారు. మొహల్లా క్లినిక్స్ పేరుతో వీధి చివరనే ఉచిత వైద్యం అందించిన మొదటి ప్రభుత్వం ఆయనదే.

కేసీఆర్, కేజ్రీవాల్ ఇద్దరూ అధికారానికి వచ్చి ఎనిమిది వసంతాలు దాటాయి. నిజానికి కేజ్రీవాల్ 2013లో సీఎం అయినా వెంటనే రాజీనామా చేశారు. తర్వాత అలాంటి పొరబాట్లు ఎప్పుడూ చేయనని ప్రకటించారనుకోండి. 2015 నుంచి ఢిల్లీలో ఆయన సీఎంగా ఉన్నారు. మరో పక్క కేసీఆర్ కూడా 2014 నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పార్టీని వరుసగా మూడో టర్మ్ దిశగా తీసుకెళ్తున్నారు. తమ తమ రాష్ట్రాల్లో పటిష్టపడిన ఆ ఇద్దరు నాయకులకు ఇప్పుడు రాజకీయ ఆకాంక్షలు పెరిగాయి. సీఎం పదవి వారి హోదాకు సరిపోవడం లేదు. అంతకంటే పెద్ద పదవికే గాలం వేయాలన్న కోరిక పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా రాజకీయ పరిస్థితులు వారికి కలిసొస్తున్నాయి. బీజేపీ సుప్రీం లీడర్ అయిన ప్రధాని మోదీ చేస్తున్న తప్పిదాలు, కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఉన్న లోపాలు వారి ప్రయత్నాలకు ఊతమిచ్చేవిగా ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనమైపోతున్న రోజుల్లో తామే సమర్థమైన ప్రత్యామ్నాయమని వారిద్దరూ విశ్వసిస్తున్నారు. తమ రాష్ట్రాల్లో ప్రజామోదం ఉన్నప్పుడు, సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతున్నప్పుడూ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలను తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉందని ఇద్దరు నేతల విశ్వాసం. అదే ఆత్మవిశ్వాసం ఇప్పుడు అత్యున్నత పదవిపై కన్నేసేందుకు పురిగొల్పుతోంది.

కేసీఆర్, కేజ్రీవాల్ వారిద్దరి లక్ష్యం ఒక్కటే అయినా రాజకీయాల్లో రూటు మాత్రం వేరుగా ఉంటోంది. ఢిల్లీలో అధికారం చేతికి వచ్చే నాటికే కేజ్రీవాల్ ఒక నేషనల్ స్టార్ గా మారారు. కామన్వెల్త్ క్రీడల స్కామ్, టూ జీ స్కామ్ లాంటివి దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో అవినీతిని అంతమొందించే ధృవతారలా జనానికి కేజ్రీవాల్ కనిపించారు. 2013లో ఢిల్లీలో స్వల్పకాలం అధికారాన్ని చేపట్టి అప్పట్లో వద్దనుకునే సరికే దేశవ్యాప్తంగా ఆప్ కు ఒక గుర్తింపు వచ్చింది. సంప్రదాయ రాజకీయ పార్టీల పట్ల విసుగుచెందిన పొలిటికల్ వర్కర్స్ ఆయా రాష్ట్రాల్లో ఆప్ శాఖలను తెరిచారు. కేజ్రీవాల్ ఆయన టీమ్ సహాయ సహకారాలతో రాష్ట్ర శాఖలకు ఒక రూపు వచ్చింది. ఆ క్రమంలో పార్టీకి జాతీయ స్వరూపం స్థిరపడిపోయింది. ఇదంతా ఆప్ ను జాతీయ పార్టీగా భావిస్తూ చేసిన ప్రయత్నం కాదు. ప్రజల్లో వస్తున్న మార్పుతో తనంతటతానుగా కలిగిన పరివర్తన అనే చెప్పాలి. కేజ్రీవాల్ ఢిల్లీ తర్వాత పంజాబ్ పై కన్నేశారు. అక్కడి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన అధికార కీచులాట ఆప్ కు బాగానే కలిసొచ్చింది. కాంగ్రెస్, బీజేపీ ఓడిపోయి ఆప్ కు బంగారు పళ్లెంలో అధికారాన్నిచ్చారు. ఢిల్లీ తరహాలోనే సంక్షేమ జపం మొదలుపెట్టిన కేజ్రీవాల్ అక్కడ 300 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇచ్చేందుకు తమ ప్రభుత్వాన్ని ఒప్పించారు. కేజ్రీవాల్ సంక్షేమ పథకాలే ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయానికి కారణమయ్యాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆప్ గెలిచి ఉండకపోవచ్చు. ఆప్ కు జాతీయ హోదా వచ్చేందుకు మాత్రం తాజా ఎన్నికలు ఉపకరించాయి. ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్ లో వచ్చిన ఓట్ల ఆధారంగా పార్టీ జాతీయ స్థాయిలో నిలబడుతోంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో ఆ పార్టీకి అనూహ్యంగా 12 శాతం ఓట్లు వచ్చిన తీరుతో కేజ్రీవాల్ నాయకత్వానికి గుజరాతీలు కూడా జై కొట్టారని చెప్పక తప్పదు.

కేసీఆర్ ఇప్పటి వరకు చేసిన రాజకీయాలు వేరు. ప్రస్తుతమున్న పరిస్థితులు వేరు. ఆయన భవిష్యత్తు ఆకాంక్షలు వేరు. కేజ్రీవాల్ ఇప్పటికే వేర్వేరు రాష్ట్రాల్లో పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకున్నారు. కేసీఆర్ ఇంతవరకు తెలంగాణ నుంచి బయటకు వెళ్లలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. అకస్మాత్తుగా జాతీయ పార్టీ నినాదాన్ని నెత్తికెత్తుకున్నారు. తెలంగాణ వెలుపల ఆయన బలాన్ని బేరీజు వేసే అవకాశాలు లేవు. ఇకపై జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బీఆర్ఎస్ తన సత్తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామి పార్టీ జేడీఎస్ తో కలిసి ఏదో చేసేస్తామని కేసీఆర్ అంటున్నారు. గత అనుభవాలను మరిచిపోయి కేసీఆర్ మాట్లాడుతున్నారన్న అనుమానమూ కలుగుతోంది. ఇటీవలి కాలంలో కుమారస్వామి ఎన్నడూ సొంతబలంపై అధికారానికి రాలేదు. ఎవరితోనో కలిసి గద్దెనెక్కారు. అంతే ఫాస్ట్ గా దిగిపోయారు. ఆ సంగతి కాసేపు పక్కన పెడితే  తెలంగాణ సరిహద్దు కర్ణాటక జిల్లాలో తెలుగు వారి ఓట్ల ఆధారంగానే కేసీఆర్ రాజకీయాలు చేస్తారా లేక ఏదైనా సమ్మోహనాస్త్రం వేస్తారా అన్నది చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పార్టీల పట్ల అసంతృప్తిపరులు కేసీఆర్ వైపు రావచ్చన్నది ఒక టాక్. ఇప్పటికే విజయవాడలో రెండు మూడు పర్యాయాలు కేసీఆర్ అనుకూల ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఓట్ల పరంగా వారి బలమెంతో ఇప్పుడే చెప్పడం కష్టం. కేసీఆర్ కూడా విజయవాడలో పార్టీ కార్యాలయానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మిగతా రాష్ట్రాల పరిస్తితిని ఆలోచిస్తే రాజకీయ శూన్యతే కనిపిస్తోంది.

అవినీతి వ్యతిరేకోద్యమంతో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అవినీతికి నిలయంగా మారిందన్న ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆరోపణలతో మంత్రులను తొలగించాల్సిన దుస్థితిలోకి ఆ పార్టీ నెట్టబడింది. సత్యేంద్ర జైన్ జైలు లీలలు ఆ పార్టీ పరువును మరింతగా దిగజార్చాయి. పంజాబ్ సీఎం తాగుబోతుతనం కేజ్రీవాల్ కు ఇబ్బందికరంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆప్ శ్రేణులు దారితప్పుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా అంతే ఏడెనిమిదేళ్లుగా పార్టీ నేతలు లంచాలు, కబ్జాలు అన్నట్లుగా దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రత్యర్థులు చేయని విమర్శ లేదు. బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని కూడా దోచుకునేందుకు బయలుదేరుతున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, మంత్రులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటికీ మించి సయామీస్ కవలల్లా ఆప్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకే స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కేంద్ర బిందువులుగా విచారణ సాగుతోంది. దానితో ఆప్, బీఆర్ఎస్ రెండూ నీతివంతమైన పార్టీలేమీ కాదన్న అభిప్రాయం బలపడుతోంది.

కేసీఆర్, కేజ్రీవాల్ ఇద్దరూ రాజకీయ ఆకాంక్షలున్న నాయకులే. అవకాశం వస్తే దేశాన్ని ఏలాలన్న కోరిక ఇద్దరిలో ఉంది. మోదీని దించడం అంత సులభం కాదని ఇద్దరికీ తెలుసు. కాలంతో కదిలితే ఏదోక కూడలిలో ప్రయోజనం కలుగుతుందన్న ఆలోచన ఇద్దరు నేతలకు ఉంది. నిజానికి మోదీ ఇప్పుడో మోనార్క్. తిరుగులేని నాయకుడు. ప్రణాళికాబద్ధంగా తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకున్నారు. 1980 నుంచి బీజేపీకి దేశవ్యాప్తంగా శాఖలున్నాయి. బీజేపీకి మాతృకగా భావించే ఆరెస్సెస్ కు ప్రతీ ఊళ్లో కార్యకర్తలున్నారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకుల ఆలోచనా విధానాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే యంత్రాంగం వారికి ఉంది. పైగా ప్రధానిగా మోదీకంటూ ఒక ఇమేజ్ వచ్చేసింది. మోదీకి తిరుగులేదన్న ప్రచారమూ స్థితపడిపోయింది. అలాంటి నాయకుడితో పోటీ పడుతూ ఆయన విధానాలను ఎండగడుతూ ముందుకు సాగితేనే కేసీఆర్, కేజ్రీవాల్ ప్రధాని పదవికి పోటీ పడే సత్తా ఉన్న నాయకులన్న విశ్వాసం కలిగించే అవకాశం ఉంటుంది.

వాస్తవం చెప్పాలంటే కేసీఆర్, కేజ్రీవాల్ తమ ప్రయత్నలోపం లేకుండానే పనిచేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణ వచ్చినా కేజ్రీవాల్ తిప్పుకొడుతున్నారు. కొందరు కార్పొరేట్లకే దేశాన్ని మోదీ దోచి పెడుతున్న తీరును ఎండగడుతున్నారు. ఆప్ ఉంటే దేశం ఎలా ముందుకు సాగుతుందో వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ చేతికి వస్తుందని చెప్పేస్తున్నారు. గుజరాత్ వస్తే ఇండియాను ఏలినట్లేనన్న ఫీలింగ్ ఇస్తున్నారు. కేసీఆర్ కూడా మోదీని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు ఫార్మ్ హౌస్ కేసుతో బీజేపీని ఇరుకునపెట్టిన కేసీఆర్ ప్రధాని మోదీ పాలన సబ్కా విశ్వాస్ కాదు సబ్కా బక్వాస్ అంటున్నారు. మోదీని మోసగాడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. జనాకర్షణలో కేసీఆర్, కేజ్రీవాల్ తిరుగులేని నేతలనే చెప్పాలి. దేశ జనాభాలో 50 శాతం ఉన్న రైతులను ఆకట్టుకునేందుకు కేసీఆర్ కొత్త నినాదాన్ని మొదలెట్టారు. అబ్కీ బార్ కిసాస్ కా సర్కార్ అంటూ రైతులను ప్రసన్నం చేసుకుంటున్నారు.

ఇల్లు కదలకపోతే ప్రపంచం తెలీదంటారు. ఆ సంగతి కేసీఆర్, కేజ్రీవాల్ గుర్తించాలి. ప్రధాని మోదీ తరహాలో దేశమంతా విస్తృత పర్యటనలు చేపట్టాలి. మమతా, నితీష్ లాంటి నేతలతో భేటీలు కంటే జనంలో కలిసిపోయే కార్యక్రమాలు చేపట్టాలి. దేశం మొత్తానికి పనికొచ్చే తమ విధానాలను స్వయంగా ప్రచారం చేయాలి. 2024 లోక్ సభ ఎన్నికలే వారిద్దరి టార్గెట్ అయితే సమయం చాలా తక్కువగా ఉంది. సరిగ్గా ఏడాదిన్నర కూడా లేదు. ఇంతపెద్ద దేశంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు అంత సమయం సరిపోతుందని చెప్పలేం. అందుకే త్వరపడాలి. పైగా దేశంలో ఇద్దరు నేతలకు క్షేత్రస్థాయి బలం లేదు. కేజ్రీవాల్ ఇంతవరకు దక్షిణాదిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

కేసీఆర్ , కేజ్రీవాల్ ఇద్దరూ మంచి వక్తలే. జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు చేసే నాయకులే. కాకపోతే పరిణామ క్రమంలో కేసీఆర్ బాగా ఓపిక ఉన్న నాయకుడు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమిస్తూనే ఎక్కడా నిరాశకు లోనుకాకుండా జనాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలన్న కోరిక లేకుండా ముందుకు సాగారు. ఇప్పుడు కూడా దేశ్ కీ నేతా కావాలంటే అదే ధోరణి పాటించాలని ఆయనకు తెలుసు. ఆ కోరిక ఇప్పుడే నెరవేరొచ్చు. లేకపోతే కొంచెం టైమ్ పట్టొచ్చు. పనులు మాత్రం ఆపకూడదు ఎందుకంటే ప్రయత్నం రాజకీయ నాయకుడి లక్షణం.