రెండు అడుగులు ముందుకు.. ఇక దంచుడేనా.. జాతీయ రాజకీయాల్లో ఫలిస్తున్న కేసీఆర్ గేమ్ ప్లాన్

By KTV Telugu On 8 June, 2022
image

దేశ రాజకీయాలకు దక్షిణాది టచ్ వచ్చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ టూర్లతో జాతీయ స్థాయిలో చలనం కనిపిస్తోంది. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఊపందుకున్నాయనే చెప్పాలి. గులాబీ దళపతి కేసీఆర్ ఒక వైపు తెలంగాణ పాలనలో బిజీగా ఉంటూనే.. మరో పక్క జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తొలుత ఢిల్లీ పర్యటన, తర్వాత బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ సూపర్ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పుడాయన నెక్ట్స్ స్టెప్ పై దృష్టి పెట్టారు. విపక్ష నేతలను సంఘటిత పరిచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు..

పనిచేసిన ప్రకటనలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం  సందర్భంగా ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందులో వివరించారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణ అమలు చేస్తున్న తరుణంలో ఉత్తరాదినేతలు, ప్రజలు తెలంగాణ ప్రభుత్వ సక్సెస్ పై ముచ్చట పడ్డారట. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు అమలు చేయాలన్న ఆలోచన, తెలంగాణను అనుసరించాల్సిన ఆవశ్యకతను అటు వైపు ఉన్న ప్రజలు గుర్తించారట. సంక్షేమ పథకాలపై టీఆర్ఎస్ అధినేతతో చర్చించాలని కొందరు ఉత్తరాది నేతలు సిద్ధమవుతున్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు ఈ అంశం కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు..గల్వాన్ ఘర్షణల్లో చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలన్న కేసీఆర్ నిర్ణయం జాతీయ స్థాయిలో ఆయనకు మంచి పేరు తెచ్చిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ స్వయంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన  ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా కేసీఆర్ సాయం చేశారు. రైతు కుటుంబాలు కూడా కేసీఆర్ సాయంపై హర్షం వ్యక్తం చేశాయి.

తదుపరి చర్యలపై కేసీఆర్ దృష్టి

ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటక నేతలతో చర్చల తర్వాత కేసీఆర్ తదుపరి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఒక జాతీయ సదస్సు నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేశారు.  షెడ్యూల్ ఖరారు కానప్పటికీ ఈ నెలలోనే ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. మాజీ బ్యూరోక్రాట్ల సలహాలు తన ప్రయత్నాలకు ఊతమిస్తాయని ఆయన భావిస్తున్నారు. బిహార్ , పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడి నేతలతో భేటీ కావాలని కేసీఆర్ తీర్మానించుకున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీలో   ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుపై ఒక క్లారిటీ  రావచ్చు. బిహార్ లో లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ తో బాటు…వీలైతే  సీఎం నితీశ్ కుమార్ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నితీశ్ తన సంకీర్ణ భాగస్వామి బీజేపీ  తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

గుజరాత్ ఎన్నికల తర్వాత….

జాతీయ రాజకీయాల్లో అజెండాను సిద్ధం చేసుకునేందుకు కేసీఆర్ తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. కాబోయే భాగస్వాములకు ఇబ్బంది లేకుండా ఈ అజెండా రూపొందించాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్డీయే కంటే సమర్థంగా దేశాన్ని పాలిస్తామని చెప్పే అజెండా ఉండాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత  పూర్తి స్థాయిలో అజెండా రూపుదిద్దుకుంటుంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఒటమి పాలైన పక్షంలో కేసీఆర్ ప్రయత్నాలకు మరింత ఊతమిచ్చినట్లు అవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి….