” సంచలనానికి ” కేసీఆర్ స్కెచ్ రెడీ!

By KTV Telugu On 30 May, 2022
image

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే సంచలనం గురించి మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌ను కలిసిన తర్వాత దేశంలో ఓ సంచలనం జరగాల్సి ఉందన్నారు. గత వారం బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామిలను కలిసిన తర్వాత ఆ సంచలనం రెండు, మూడు నెలల్లోనే ఉంటుందన్నారు. దీంతో ఆ సంచలనం ఏమిటన్న చర్చ రాజకీయాల్లో ప్రారంభమైంది. రెండు, మూడు నెలల్లో ఉన్నది రాష్ట్రపతి ఎన్నికలే కావడంతో ఆ ఎన్నికల ద్వారానే సంచలనానికి సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నాహజారే !

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తే అంతకు మించిన సంచలనం ఏమీ ఉండదు. కేసీఆర్ .. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని తాజా పరిణామాల బట్టి అర్థం చేసుకోవచ్చు. విపక్షాల తరపున ఉమ్మడిగా అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ అభ్యర్థిని ఓడిస్తే కేసీఆర్ చెప్పిన సంచనలం నమోదవుతుంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారానే నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వయంగా మహారాష్ట్రలోని అన్నా హాజరే స్వగ్రామం రాలేగావ్ సిద్ధికి వెళ్లి ఆయనతో మాట్లాడి ఒప్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ వారమే వెళదామనుకున్నారు, కానీ ఆగిపోయారు. వచ్చే వారం వెళ్లే అవకాశం ఉంది.

అన్నా హజారేకు దేశవ్యాప్తంగా క్లీన్ఇమేజ్ !

ఆయనకు దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. ఏ పార్టీకీ ఆయన మద్దతుగా ఉన్న సందర్భాలు లేవు. దీంతో అన్ని పార్టీలు ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తాయని కేసీఆర్ నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. అన్నాహజారే కాంగ్రెస్ హాయంలో అవినీతి వ్యతిరేక పోరాటం.. లోక్ పాల్ బిల్లు కోసం చేసిన పోరాటం దేశాన్ని కదిలించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ పోరాటం నుంచే వచ్చారు. అన్నా హజారే నేరుగా రాజకీయాల్లోకి రాలేదు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్‌తోనూ ఈ అంశంపై కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. దేవేగౌడ, కుమారస్వామితోనూ ఇదే టాపిక్ మాట్లాడినట్లుగా చెబుతున్నారు .   బీహార్ వెళ్లి ఎన్డీఏ మిత్రపక్షం.. అయిన జేడీయూ నేత .. సీఎం నితీష్ కుమార్‌తోనూ మాట్లాడాలనుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ అంగీకరించడమే కీలకం !

అయితే అన్నా హజారేను రేసులో నిలబెట్టాలంటే  కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకోవాలి. కానీ యూపీఏ హయాంలో ఆ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన అన్నా హజారేను కాంగ్రెస్ సమర్థిస్తుందా అన్నది సందేహమే. అయితే ఆయనకు ఉన్న ఇమేజ్ ప్రకారం.. సమర్థించడాన్ని వ్యతిరేకించే అవకాశం లేదని అనుకోవచ్చు. ఈ అంశంలో కేసీఆర్ చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌తో కేసీఆర్ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇటీవల తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్‌ ఎలాంటి సంబంధాలు పెట్టుకునే ప్రశ్నే లేదన్నారు.  కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ కలసి వస్తుందని భావిస్తున్నారు.

బీజేపీ వర్సెస్ అన్నా హజారే అన్నట్లుగా పోటీ జరిగితే.. కేసీఆర్ సంచలనం కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుందని అంచనా వేయవచ్చు.  ఎదుకంటే ఇప్పటి వరిస్థితిని బట్టి చూస్తే..  బీజేపీ కన్నా ఇతర విపక్షాలకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అన్నీ కలసి కట్టుగా ఓటు వేస్తే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఓడిపోతారు.