ఆ సంచలనం ఏమిటి ? ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో త్వరలో ఓ సంచలనం జరగబోతోందని ప్రకటించారు. ఆ సంచలనం ఏమిటన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడ అఖిలేష్, కేజ్రీవాల్ వంటి వారితో భేటీ అయ్యారు. ఆ తర్వాత … దేశంలో ఓ రాజకీయ సంచలనం జరగాల్సి ఉందని… జరుగుతుందని ప్రకటించారు. ఆ సంచలనం ఏమిటన్నదానిపై ఆయన ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కేసీఆర్ ప్లాన్డ్‌గా సంచలనం సృష్టించాలని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. ఆ సంచలనం ఏమిటి..? దేంట్లో సంచలనాలకు అవకాశాలు ఉన్నాయన్నదానిపై ఇప్పుడు రకరకాల చర్చలు నడుస్తున్నాయి ?
రాష్ట్రపతి ఎన్నికల్లో మాస్టర్ స్ట్రోక్ కొడతారా ?
ప్రస్తుతం దేశంలో జరగబోతున్న కీలక పరిణామం రాష్ట్రపతి ఎన్నికలు. సంచలనం సృష్టించాలంటే ఇంతకు మించిన సందర్భం కేసీఆర్‌కు చిక్కదు.. దొరకదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. ఆ పార్టీ పూర్తిగా ఉత్తరాదికే పరిమితం అయింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికపై ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిందే. రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీలో 10,98,903 ఓట్లు ఉండగా, బీజేపీకి 4,65,797 ఓట్లు, మిత్ర పక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి. మొత్తం 5,37,126 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి లభిస్తాయని, అయినప్పటికీ 9,194 ఓట్లు తక్కువవుతాయని లెక్కలేస్తున్నారు. ఒక వేళ ఎన్డీఏతర పార్టీలన్నీ కలిసికట్టుగా ఒకే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం బీజేపీకి చిక్కులు తప్పకపోవచ్చని అంటున్నారు. కేసీఆర్ ఈ దిశగా అడుగులు వేసేందుకే రాష్ట్రాల పర్యటనలు ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు.
గతంలో కేసీఆర్ కీలక పాత్ర..కాకపోతే అనుకూలంగా ..!
గతంలో రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించినప్పుడు ప్రధాని మోదీ స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. దీంతో టీఆర్‌ఎ్‌సకు ఉన్న 82 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపీలు కూడా రాంనాథ్ కోవింద్‌కే జైకొట్టారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ కి 103 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో ఈ పార్టీ వైఖరిపై బీజేపీలో గుబులు నెలకొన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఢిల్లీ పాలిత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గతంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఈసారి ఈ పార్టీ వైఖరి కూడా మారనుంది. పైగా ఈ సారి ఆప్ బలం పెరిగింది. ఇప్పుడు కేసీఆర్ ఆప్‌తో చర్చలు జరపుతూ ఉండటం.. సంచలనం గురించి మాట్లాడుతూ ఉండటంతో .. రాష్ట్రపతి ఎన్నికల గురించేనని చెప్పుకుంటున్నారు.
బీజేపీకి వైసీపీని దూరం చేస్తే సంచలనం ఖాయమేనా ?
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి బీజేపీకి వైసీపీ, బీజేడీ లాంటి పార్టీలు ఉన్నాయి. ఇప్పటికయితే అవి బీజేపీ రాడార్ దాటిపోవు. అయితే వైసీపీ లాంటి పార్టీ హ్యాండ్ ఇస్తే మాత్రం… బీజేపీకి షాక్ తగలొచ్చు. రాజకీయంగా సంచలనం నమోదు కావొచ్చు. కేసీఆర్‌తో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ దిశగా ఏమైనా సంచలనాలు ప్లాన్ చేస్తున్నారేమో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం గట్టి ప్రణాళికల్లో ఉన్నారని తన మాటల ద్వారానే వెల్లడిస్తున్నారు. జగన్ ఇప్పటికిప్పుడు.. బీజేపీని ధిక్కరించి కేసీఆర్ వెంట నడిచే పరిస్థితి లేదు. బీజేపీ పరిస్థితి బాగో లేదనుకుంటే ఆయన ఎన్నికలకు ముందు బయటపడే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే అప్పటి వరకూ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉండదు. కానీ కేసీఆర్ రాజకీయ చాణక్యం గురించి తక్కువగా అంచనా వేయాడనికి లేదు కాబట్టి… ముందు ముందు.. కేసీఆర్ చెప్పే విషయం పెద్ద సంచలనం.. అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆ సంచలనం రాష్ట్రపతి ఎన్నికలు అవడానికే ఎక్కువ చాన్సులు ఉన్నాయి. అది కాకపోతే మరేమిటి అన్నది కేసీఆర్ రాజకీయ అడుగులను బట్టి అంచనాకు వచ్చే అవకాశం ఉంది.