నిరుద్యోగులతో కేసీఆర్ చెలగాటం !

By KTV Telugu On 7 April, 2022
image

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ ధురంధురుడు. ఆయన ఇట్టే మాట మార్చేయగలరు. దాన్ని నమ్మించగలరు. అందుకే గత ఏడేళ్ల నుంచి ఒక్క గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయకపోయినా ఇబ్బంది లేకుండా బండి నడిపించుకొచ్చారు. నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో సాగిన ఉద్యమంలో నియామకాలను ఇంత కాలం పట్టించుకోకపోయినా రెండు సార్లు అధికారంలోకి వచ్చారంటే అది కేసీఆర్ చాణక్యం. కానీ ఎల్లప్పుడూ సాగదు. ఎప్పుడో ఓ సారి తెగిపోతుంది. అందుకే ఇప్పుడు ఉద్యోగాల భర్తీ పేరుతో కేసీఆర్ రాజకీయం ప్రారంభించారు.

ఉద్యోగాల భర్తీ ప్రకటన మాటలకే పరిమితం కాకూడదు !

తెలంగాణలో నిరుద్యోగులు, విద్యావంతులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాల భర్తీపై ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో పోస్టులను భర్తీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొలువుల జాతర జరుగుతుందని ఎంతో ఉత్సాహంతో గత కొన్నేండ్లుగా కోచింగ్‌సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు సమర్పించుకున్నా నోటిఫికేషన్లు పడనందున కొంతమంది నిరాశతో ఆత్మహత్యలూ చేసుకున్నారు. తమ భవిత ఏమీకానుందోనని అనేక మంది నిరుద్యోగ యువత ఎంతో ఆందోళనతో నిరాశలోకి పోయారు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటనతో అందరికీ కాస్త ధైర్యం వచ్చింది.

ఎంత వేగంగా భర్తీ చేస్తే అంత రాజకీయ ప్రయోజనం !

ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగినంత వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక్కడే చాలా మందికి అనుమానం వస్తోంది. ఎన్నికలు వచ్చే వరకూ భర్తీ ఉండదేమోనని నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. భర్తీ ప్రక్రియలో న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాల్సి ఉంది. లేకపోతే టిఆర్టీ-2017 లాగా అయిపోతుంది. ఇప్పటికి నోటిఫికేషన్లు ఇచ్చి కూడా ఇరవై వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ పెండింగ్‌లో ఉంది. ఇలాంటి సమస్యలన్నీ అధిగమించి ఎంత వేగంగా భర్తీ చేస్తే అంత రాజకీయ ప్రయోజనం ఉంటుంది.

నమ్మలేని విధంగా ప్రకటనలు చేసిన కేసీఆర్ !

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఇంటికో ఉద్యోగం అని ఆశలు పెంచారు. తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండవన్నారు. కానీ ఎనిమిదేళ్లుగా జరిగింది వేరు. ఖాళీ అయిన పోస్టులన్నింటినీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లతో నింపేశారు. ఇప్పుడు మళ్లీ ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని ప్రకటన చేసేశారు. టి.ఎస్‌.పి.ఎస్‌.సి.పోర్టల్‌ ద్వారా 29 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్‌ చేసుకున్నారు. పి.ఆర్‌.సి. కమిటి లక్ష 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చె్ప్పింది. మిగతా వాటి సంగతి తర్వాత భర్తీ చేయవచ్చు కానీ ఇప్పుడు ప్రకటించిన వాటినైనా మూడు నెలల్లో భర్తీ చేయాల్సి ఉంది.

గత ప్రకటనల్లాగే మారితే పులి మీద స్వారీనే..!

2020 డిసెంబర్‌ 13న సీఎం కేసీఆర్‌ ”రాష్ట్రంలో 50వేల ఖాళీలు ఉన్నట్టు సమాచారం. వేల సంఖ్యలో టీచర్‌, పోలీస్‌ ఉద్యోగాల రిక్రూట్మెంట్‌ జరగాల్సి ఉంది. వెంటనే ఖాళీలన్నీ గుర్తించండి. ఆ వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి” అని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత దాని మీద హడావుడి చేయడం, ఏ ఎన్నికలు వచ్చినా ”త్వరలో జాబ్‌ నోటిఫికేషన్లు వస్తరు” అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప భర్తీ చేసిన దాఖలాలు లేవు. తాజా ప్రకటనైనా ఎన్నికల స్టంట్‌లా కాకుండా నిరుద్యోగుల ఆశలు తీర్చేదిగా ఉండాలి. అందుకు అనుగుణంగా అన్ని ఉద్యోగాలకు ఒకే సారి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాల్సి ఉంది. లేకపోతే కేసీఆర్‌కు ఎన్నికల్లో నిరుద్యోగులు కొట్టే దెబ్బ తీవ్రంగా తగులుతుంది.