తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్….కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. బీజేపీ సర్కార్ వైఫల్యాలను ఎప్పటికపుడు ఎత్తిచూపుతున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తే…కేసీఆర్ కర్ణాటకకు వెళ్లిపోతున్నారు. ప్రధాని మోడీకి పోటీగా… కేసీఆర్ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు గులాబీ దళపతి వ్యవహరిస్తున్నారు.
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా…కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. దీనికి పోటీకి ముఖ్యమంత్రి కేసీఆర్…వజ్రోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో… రగిలించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరపడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనేలా….కార్యక్రమాలను రూపొందిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో కోటి 20 లక్షల ఇళ్లపై ఎగురవేసేందుకు… జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న కార్యక్రమాలకు… వజ్రోత్సవ ద్విసప్తాహం అనే పేరు పెట్టారు. హెచ్‌ఐసీసీలో జరిగే వజ్రోత్సవాల ప్రారంభోత్సవానికి…ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు…దాదాపు రెండు వేల మంది హాజరుకానున్నారు. వజ్రోత్సవాల నిర్వహణకు జిల్లాస్థాయి కమిటీలను ప్రభుత్వం నియమించింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఎక్కడ కార్యక్రమం జరిగినా…ప్రధాని మోడీ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్న కేసీఆర్…ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో మోడీకి పేరు రాకుండా ముందే వజ్రోత్సవాలను ప్లాన్ చేశారు. క్రెడిట్ మొత్తం ప్రధాని మోడీకి వెళ్లకుండా….రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించి చెక్ పెట్టాలని నిర్ణయించారు. అందుకే వజ్రోత్సవాలను 15 రోజులు ప్లాన్ చేశారు. తెలంగాణలో మోడీ గురించి చర్చ జరగకుండా…టీఆర్ఎస్, ప్రభుత్వం గురించి చర్చించుకునేలా కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. జెండా విషయంలోనూ సొంత అజెండాను ఫాలో అవుతూ…బీజేపీ నేతలు సైలెంట్ అయ్యేలా వ్యవహరిస్తున్నారు. వజ్రోత్సవాలపై కమలనాథులు ఎలాంటి విమర్శలు చేసినా…తెలంగాణను అవమానిస్తున్నారంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో బీజేపీ నేతలు కేసీఆర్ నిర్వహించే… వజ్రోత్సవ ద్విసప్తాహంను నోరుమెదపలేని పరిస్థితుల్లో ఉన్నారు.
ఈ నెల 6న జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవాల కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులను ఆహ్వానించింది. అదే సమయంలో కేసీఆర్ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. గతంలో ప్రధాని మోడీ హైదరాబాద్ కు వచ్చినపుడల్లా పోటీ కార్యక్రమాలు పెట్టుకున్నారు కేసీఆర్. సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చినపుడు…అనారోగ్యం కార్యక్రమాని దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ స్కూల్ వార్షికోత్సవాలకు వచ్చినపుడు…మరో రాష్ట్రానికి వెళ్లి జాతీయ రాజకీయాలపై చర్చించారు. రెండ్రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరిగినా…ప్రధాని మోడీని కలవకుండా దూరం పాటించారు.
మోడీ గద్దె దింపేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఏ పార్టీ నాయకుడు చేయని విధంగా బీజేపీ సర్కార్, మోడీని టార్గెట్ చేస్తున్నారు. మున్ముందు మోడీకి పోటీగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతారో…ఎలాంటి విమర్శలు చేస్తారో వేచి చూడాలి.