కేసీఆర్ బైక్ స్కీం

By KTV Telugu On 29 July, 2022
image

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…వినూత్న పథకాలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో…కొత్త స్కీంలకు శ్రీకారం చుడుతున్నారు. ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోయినా సరే…సంక్షేమ పథకాల కోసం నిధులు భారీగా కేటాయిస్తున్నారు. ఏ రాష్ట్రమూ అమలు చేయని స్కీంలతో ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు పథకాలకు ఖర్చు చేస్తూ…ప్రజలను టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రైతులు, దళితులకు ప్రత్యేక స్కీంలు రూపొందించి…వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తోంది. రైతులు, దళితుల అభ్యున్నతికి పాటుపడతోంది. తాజాగా అసంఘటిత రంగ కార్మికుల కోసం కు సబ్సిడీ మీద లక్ష బైక్ లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. నిర్మాణ రంగ కార్మికులకు సబ్సిడీ మీద లక్ష బైక్ లను పంపిణీ చేసేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించింది కేసీఆర్ సర్కార్. కార్మికబంధుగా నామకరణం చేసే ఈ పథకంలో…ఎవరెవరికి బైక్ లు సబ్సిడీ కింద పంపిణీ చేస్తారన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.  స్కీంకు సంబంధించిన విధివిధానాలు…మూడు నెలల్లోపు ఖరారు చేయనుంది. ఈ ఏడాది చివరిలో లేదంటే…కొత్త సంవత్సరంలో కొత్త పథకం కింద బైకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

2018 ఎన్నికల ముందు…అన్నదాతల కోసం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఎకరాకు ఐదు వేలు చొప్పున… ఏడాదికి రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 68 లక్షల మంది అర్హులైన అన్నదాతలకు…ఇప్పటి వరకు 60వేల కోట్ల రూపాయలకుపైగా అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసింది. వ్యవసాయ అనుబంధ సంస్థల ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు బీమా కోసం… కంపెనీలకు 3వేల కోట్లకుపైగా చెల్లించింది తెలంగాణ ప్రభుత్వం. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న దళితుల కోసం దళితబంధును తీసుకొచ్చింది. ఒక్కో లబ్దిదారుడికి 10 లక్షల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఈ పథకం కోసం 12వందల కోట్లు కేటాయించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో విద్యార్థినులకు…ఆదరణ పథకం కింది సైకిళ్లు పంపిణీ చేశారు. అప్పట్లో లక్ష మందికిపైగా విద్యార్థినులు లబ్ది పొందారు. మారుతున్న కాలానికి అనుగుణంగా…బైక్ లు ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. కార్మికబంధులో ఎలాంటి అవకతవకలు జరగకుండా…..పకడ్బందీ అమలు చేయాలని నిర్ణయించింది. కార్మికులకు ఇవ్వాలని సంకల్పించిన ప్రభుత్వం…ఇస్తే ఏ బైకులు సబ్సిడీ కింద ఇస్తుంది ? లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందా లేదంటే… ప్రభుత్వమే అర్హులను గుర్తించి డైరెక్టుగా బైకులు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రైతుబంధు, దళితబంధు పథకం పొందుతున్న వారిని కాదని…కొత్త వారికి పంపిణీ చేస్తుందా ? నిర్మాణ రంగ కార్మికుల మాత్రమే పంపిణీ చేస్తుందో తెలియాలంటే…మరికొంత కాలం ఆగాల్సిందే. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినా….బడ్జెట్  లేకపోయినా…ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం…సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు.