* ఏపీలో మొదలెట్టేశారు..నెక్ట్స్ ఇక సౌత్ స్టేట్సే!
* కేసీఆర్ జాతీయపార్టీ.. దక్షిణాది రాష్ట్రాలే టార్గెట్
జాతీయపార్టీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా లెక్కలుంటాయి. అందుకే కేసీఆర్ ఆచితూచి అడుగేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌లో ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిపెట్టుకునే టీఆర్‌ఎస్ పేరుమారుస్తున్నారు. ఇల్లలకగానే పండగకాదన్నట్లు పేరుమార్చినంత మాత్రాన, పదిమంది నాయకులు కలిసినంత మాత్రాన జాతీయపార్టీ గుర్తింపు వచ్చేయదు. ఎన్నో పార్టీలున్న దేశంలో ఇప్పటిదాకా 10పార్టీలకే జాతీయ గుర్తింపు ఉంది.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ, సీపీఎం, ఆల్‌ఇండియా తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీకి ఈ దేశంలో జాతీయపార్టీలుగా గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు రావడానికి చాలా లెక్కలుంటాయి. చివరిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. పార్టీనుంచి కనీసం నలుగురు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.
తెలంగాణ సాధించిన పార్టీగా ఇప్పటిదాకా ఆ రాష్ట్రానికే పరిమితమైంది టీఆర్‌ఎస్. ఇప్పుడు జాతీయపార్టీ హోదాకోసం మరో తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌మీద దృష్టిసారించింది. ఏపీలోనూ కేసీఆర్‌కి కోకొల్లలుగా అభిమానులున్నారని గులాబీపార్టీ గతంలో చెప్పుకుంది. ఇప్పుడు జాతీయపార్టీగా ఎదిగేందుకు ఏపీలోనూ విస్తరించాలన్న వ్యూహంతో ఉంది. దీనికోసం అప్పుడే ఫేస్‌వాల్యూ ఉన్న నాయకులకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. తెలుగురాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాదిరాష్ట్రాలపైనా టీఆర్‌ఎస్ కన్నేయబోతోంది. మహారాష్ట్ర, కర్నాటకమీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతోంది. మిగతా రాష్ట్రాల్లో గెలుస్తామా లేదా అన్నది తర్వాత. కనీసం ఎన్నికల కమిషన్ ‘లెక్క’కి సరిపడా ఓట్లొచ్చినా చాలు. ఇక గులాబీబాస్ ప్రయత్నాలు ఆ దిశగానే ఉండబోతున్నాయి.