– రాజభవన్ పెత్తనం..కేరళలో ముదిరింది!
– వీసీల రీకాల్.. కేరళ గవర్నర్ తెగేదాకా లాగారుగా!
మొన్నటిదాకా పశ్చిమబెంగాల్లో రగడ. కొన్నాళ్లుగా తమిళనాట అదే రచ్చ. తెలుగురాష్ట్రమైన తెలంగాణలోనూ ప్రొటోకాల్ గొడవలు. విపక్షపాలిత రాష్ట్రాల్లో రాజ్‌భవన్‌లతో ప్రభుత్వాలకు దూరం పెరుగుతోంది. కేరళలో కొన్నాళ్లుగా నడుస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం గవర్నర్ దూకుడుతో ముదిరిపాకాన పడింది. కేరళలో యూనివర్సిటీల వీసీల నియామకంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం రసకందాయంలో పడింది.
కేరళలోని తొమ్మిది యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. వైస్చాన్స్లర్ల రాజీనామాలకు ఆదేశాలు ఇవ్వడమే కాదు.. దానికి డెడ్‌లైన్ కూడా పెట్టారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్‌ఖాన్. యూజీసీ నిబంధనలకు విరుద్ధమంటూ ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని ఈమధ్యే సుప్రీం రద్దు చేసింది. ఈ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ తొమ్మిది వర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని గవర్నర్ హుకుం జారీచేశారు. ఈ జాబితాలో ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ వర్సిటీ వీసీ కూడా ఉన్నారు.
పినరయి విజయన్ సర్కారు, గవర్నర్‌కు మధ్య కొన్నాళ్లుగా ఘర్షణపూరిత వాతావరణం ఉంది. ప్రభుత్వం మద్యం, లాటరీలాంటి వ్యసనాల్ని ఆదాయవనరుగా చూస్తోందని గవర్నర్ తీవ్ర విమర్శలు చేశారు. ఉడ్తాపంజాబ్ని కూడా తొందర్లోనే కేరళ దాటేయబోతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మర్నాడే వీసీల రాజీనామాకు ఆదేశాలిచ్చారు. అయితే వీసీల రాజీనామా కోరే అధికారం గవర్నర్‌కు లేదంటున్నారు సీఎం విజయన్. గవర్నర్ ఆదేశాలు రాజ్యాంగం విరుద్ధమంటున్నారు. గవర్నర్ ఆదేశాలు అందినా రాజీనామాకు వీసీలు ససేమిరా అంటున్నారు. మరి ఈ వివాదంలో గవర్నర్‌గిరీ నడుస్తుందో..ప్రభుత్వ పంతం నెగ్గుతుందో చూడాలి.