*సర్వేలన్నీ బీజేపీదే విజయం అని చెబుతున్నాయి
*సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని టీఆర్‌ఎస్ ధీమా
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు తమదేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బై ఎలక్షన్‌కు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని అక్కడ భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. మునుగోడులో చేసిన సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. గత నెలలో సీఎం కేసీఆర్ తన పార్టీ నేతలతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం టీఆర్‌ఎస్‌దే అన్నారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. రెండోస్థానంలో కాంగ్రెస్, మూడోస్థానంలో బీజేపీ ఉంటాయని చెప్పారు కేసీఆర్.
అయితే మునుగోడు ప్రజలు తెలివైనవారు..ఎవరికి మొదటి స్థానం…ఎవరికి మూడో స్థానం ఇవ్వాలనేది అక్కడి ప్రజలే నిర్ణయిస్తారన్నారు కిషన్‌రెడ్డి. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనేదే తమ ఉద్దేశం అని ఆయన్నారు. మునుగోడు ఉప ఎన్నిక హెడ్యూల్‌తో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతిని ఇప్పటికే ఆ రెండు పార్టీలు ప్రకటించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనేది కేసీఆర్ ఇంకా ప్రకటించలేదు. అయితే టీఆర్‌ఎస్ తరపున పోటీలో నిలిచేవారిలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.