ఒకవైపు ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేస్తున్న సొంత తమ్ముడు… మరోవైపు తన సొంత పార్టీ. ఎవరికి మద్దతు తెలపాలో, ఎవరి తరపున ప్రచారం చేయాలో అర్థం కానీ సందిగ్ధ పరిస్థితిలో కామ్‌గా ఆస్ట్రేలియా టూర్‌కు బయలుదేరారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారానికి రమ్మంటూ పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడిని పట్టించుకోకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళుతున్నారు. మళ్లీ నవంబర్ 7న తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ఆయా పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పాల్వాయి శ్రవంతి తనకు మద్దతుగా ప్రచారానికి రావాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్వయంగా అభ్యర్థించింది.
అయినా సరే వెంకటరెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. ముందు నుండి కూడా ఆయన తాను ప్రచారానికి రాను అనే సమాధానం చెపుతూ వచ్చారు. తన లాంటి హోమ్ గార్డ్స్ ప్రచారం అవసరం లేదని, ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వంద కేసులు పెట్టినా సరే సర్కార్‌ను తీసుకొస్తానని ఓ నేత చెప్పాడు. ఆయనే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపిస్తాడు అని వ్యంగాస్త్రాలు సంధించారు. ఇక్కడే ఉంటే ఈ చికాకులు తప్పవని ఆస్ట్రేలియాకు బయలుదేరారు. మునుగోడులో పార్టీ తరపున ప్రచారానికి రాకుండా వెంకట్‌రెడ్డి విదేశాలకు వెళ్తుండడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. విచిత్రం ఏమిటంటే తాను చచ్చేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఇటీవల ప్రకటించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చచ్చేవరకు పార్టీలోనే ఉండేవాడు ప్రచారానికి ఎందుకు రాడు అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.