చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తర్వాత సొంత పార్టీ ఆలోచన చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గారు. కానీ చేరలేదు. చివరికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేరడానికి బీజేపీ నేతలు కూడా ఆయనతో అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. రకరకాల హామీలు ఇచ్చారు. కొండా ఇంటికి తరుణ్ ఛుగ్ వెళ్లి .. స్వయంగా నడ్డాతో మాట్లాడించారు. అప్పుడు మాత్రమే ఆయన చేరడానికి అంగీకరించారు. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ ఇంత తీవ్రంగా ఎందుకు ప్రయత్నించింది ? రేవంత్ రెడ్డి లాంటి ఆత్మీయుడు ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీ వైపు ఎందుకు మొగ్గారు ? ఇవన్నీ తెలంగాణ రాజకీయవర్గాలకు పజిల్ లాంటి ప్రశ్నలే.
కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో ఎలాంటి దాపరికాలు లేవు. కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఒక్కటే డౌట్. అదేమిటంటే.. తాను బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ టీఆర్‌ఎస్ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో అవగాహనకు వస్తే తన పరిస్థితేమిటనేది ఆ డౌట్. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పుకున్నారు. తన టార్గెట్ టీఆర్ఎస్ అని.. ఆ పార్టీని గద్దె దించేందుకే పని చేస్తానని ప్రకటించారు. ఇదే డౌట్ కాంగ్రెస్ విషయంలోనూ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటికీ ఆయన ఆ పార్టీలో చేరేందుకు తొందరపడలేదు. రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి అడిగినా చూద్దాం అన్నారు కానీ ఆగలేదు. ఆ మధ్య వైట్ చాలెంజ్ పేరుతో రేవంత్ రెడ్డి హంగామా చేసి… కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును ఇంక్లూడ్ చేసినా ఆయన పాజిటివ్‌గానే స్పందించారు. అయితే అంతిమంగా ఆయన బీజేపీ వైపు మొగ్గారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆయన నమ్మకంగా ప్రకటించారు.
ఏం జరిగినా టీఆర్ఎస్‌తో ప్రత్యక్షంగా పరోక్షంగా పొత్తులు పెట్టుకోబోమని ఆయనకు బీజేపీ స్థానిక.. ఢిల్లీ నేతల నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆయన బీజేపీ పంచన చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు ఇంత నమ్మకం కలిగించి మరీ పార్టీలో చేర్చుకోవడం వెనుక బీజేపీకి చాలా కారణాలు ఉన్నాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాస్ లీడర్ కాకపోయినప్పటికీ ఆయనకంటూ ఓ ఇమేజ్ ఉంది. రెడ్డి సామాజికవర్గంలో పలుకుబడి ఉంది. ఘనమైన వంశ చరిత్ర ఉంది. మున్నూరు కాపులను గట్టి ఓటు బ్యాంక్‌గా మార్చుకున్నామని అనుకుంటున్న బీజేపీ నేతలు ఇప్పుడు రెడ్డి సామాజికవర్గంపైనా కన్నేశారు. కొండా చేరికతో రెడ్డి సామాజికర్గంలో కొంత శాతం అయినా బీజేపీ వైపు మొగ్గుతుదన్న విశ్లేషణలకు బీజేపీ హైకమాండ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. కొంత శాతం ఓట్లతో బీజేపీకి చాలా పెద్ద ప్రయోజనం కలుగుతుంది. ఎలా అంటే.. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకుల్లో ఒకటిగా ఉంది.
గతంలో వివిధ పార్టీల మధ్య చీలిపోయినా రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో వ్యూహాత్మకంగా రెడ్డి వర్గాన్ని ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ అంత వరకూ బలపడుతుందన్నమాట. అదే సమయంలో ఆ బలాన్ని కొంత వరకూ తగ్గించగలిగితే కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచినట్లే అవుతుంది. కొండా కాంగ్రెస్ లో చేరి ఉండే రెడ్డి సామాజికవర్గం మరింత ఏకమయ్యేది. కానీ ఇప్పుడు బీజేపీలో చేరడం వల్ల… ఆ అవకాశం మిస్సయింది. ఆ వర్గంలో బీజేపీకి కొంత వాటా లభిస్తుంది. ఆ మేరకు కాంగ్రెస్‌కు లోటు ఏర్పడుతుంది., కాంగ్రెస్‌కు లోటు అంటూ ఏర్పడితే ప్రధానంగా లాభపడేది బీజేపీనేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ ను ఎంత బలహీనం చేస్తే బీజేపీ అంత బలపడుతుంది.
అదే సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బకొట్టవచ్చు. టీఆర్ఎస్‌లో ఎంపీగా ఉన్న ఆయన కొండా.. అక్కడ అసంతృప్తికి గురై పార్టీ మారాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కీలకంంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. రేవంత్ నాయకత్వంపై ఆయన నమ్మకంతో ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా రేవంత్‌ను కాదన్నారంటే.. ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డికి మైనస్ అవుతుంది. ఆయనను .. ఆత్మీయులు కూడా నమ్మడం లేదని.. కాంగ్రస్ పార్టీ గెలుస్తుందని వారు కూడా అనుకోవడం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని బీజేపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సామాజికవర్గ సమీకరణాలతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మేధావి వర్గంలో మంచి పట్టు ఉంది. విద్యాధికుల్లో ఆయనపై నమ్మకం ఉంది. అపర కుబేరుడైన ఆయన డబ్బు కోసం రాజకీయాలు చేయాల్సిన పరిస్థితుల్లో లేరు. ఇలా అన్ని కోణాల్లోనూ ఆలోచించి.. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీ ఆకర్షించినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.