ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతున్న దావోస్ లో తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల వేట కొనసాగుతోంది. జగన్ కంటే ముందే లండన్ లో అడుగుపెట్టారు కేటీఆర్ అండ్ టీం. అక్కడ నుంచి బడా పారిశ్రామికవేత్తల్ని పెద్ద, పెద్ద కంపెనీల ప్రతినిధులతో భేటీలు అవుతున్నారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ బృందం సత్తా చాటింది. ఒకే రోజు రెండు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ బీమా సంస్థ స్విస్‌రేతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ… తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషోతో రెండో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఒకే రోజు 3వేల కోట్లకిపైగా విలువైన ఒప్పందాలు కుదిరాయి.
తాజా ఒప్పందం ప్రకారం మీషో సేవలు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించనున్నాయి. ఈ మేరకు త్వరలోనే మీషో సంస్థ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఇప్పటిదాకా ఈ సంస్థ సేవలు నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఈ సంస్థ సేవలు అందనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మీషో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
హైదరాబాద్ పేరు చెబితే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ లో అత్యుత్సాహం ఏమీ లేదు. ఇప్పటికే అనేక కంపెనీలు హైదరాబాద్ బాట పట్టాయి. నిమ్జ్ సహా, ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. పక్కా ప్రణాళికతో తమ వ్యూహాత్మక పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ ను ఎంచుకుంటున్నారు. కరోనా వల్ల లైఫ్ సైన్సెస్, మెడికల్‌కు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మెడికల్ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ఆ సంస్థల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ప్రగతిలో ఉన్న ఐటీ రంగం అభివృద్ధి కూడా వీటికి అదనపు బలంగా మారాయి. గత మార్చిలో మంత్రి కేటీఆర్ అమెరికా వారం రోజుల పాటు పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, సంస్థల సీఈవోలతో సమావేశమై, కేటీఆర్ శాన్ డియాగో, సానో హూజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించారు.
పెట్టుబడుల వేటలో తెలంగాణ అలా దూసుకుపోతుంటే.. ఇప్పటి వరకు ఏపీ పెద్ద సంఖ్యలో ఒప్పందాలు కుదుర్చుకున్న దాఖలాలు లేవు. బీసీజీ గ్లోబల్ చైర్మన్ బక్నర్‌తో జగన్ చర్చించారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్, వేదిక మొబిలిటీ, సుస్థిరత విభాగాధిపతి పెట్రో గోమెజ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్ ప్లాట్‌ఫాం భాగస్వామ్యంపై ఒప్పందం మాత్రమే జరిగింది. ఏపీలో గంగవరం పోర్టును దక్కించుకున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో జగన్ సమావేశమయ్యారు..
కేటీఆర్ దావోస్ పర్యటన ఇంకో వారం పైనే ఉండటంతో.. మరికొన్ని కంపెనీలతో ఎంవోయులు చేసుకునే అవకాశం ఉంది. మూడేళ్ల తర్వాత పెట్టుబడుల వేట ప్రయత్నాలు ఆరంభించిన జగన్… తొలిసారి సీఎం హోదాలో సతీసమేతంగా పర్యటిస్తున్నారు. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కూడా నాలుగైదు కంపెనీలైనా ఆకట్టుకోవాలని ఊబలాపడుతోంది. కాని ఏమేరకు ప్రయత్నాలు సార్దమవుతాయన్న కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.