ఫామ్‌హౌస్‌ అంశంపై టీఆర్‌ఎస్‌ నేతలెవరూ మాట్లాడొద్దు – కేటీఆర్‌

By KTV Telugu On 27 October, 2022
image

నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందనేది పూర్తిగా బయటకు తెలియడం లేదు. మీడియాలో వచ్చే కథనాలు తప్పించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఏదీ ఇంతవరకు విడుదల కాలేదు. బుధవారం రాత్రి ఫామ్‌హౌస్‌ నుంచి ప్రగతి భవన్‌కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు గురువారం రాత్రి వరకు బయటకు రాలేదు. గురువారం ఆ నలుగురు ఎమ్మెల్యేలు కానీ, పోలీసులు కానీ మీడియాకు వివరాలు అందిస్తారని చెప్పారు….ఆ తరువాత సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ఉంటుందన్నారు కానీ ఎవరూ మీడియా ముందుకు రాలేదు. 400 కోట్లు అన్నారు…పదిహేను కోట్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు..కానీ ఫామ్‌హౌస్‌ నుంచి ఎంత డబ్బు స్వాధీనం చేసుకున్నారో పోలీసులు చెప్పలేదు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పార్టీ నేతలకు గురువారం ఓ కీలక సూచన చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంపై పార్టీకి చెందిన నేతలెవరూ మీడియాతో మాట్లాడవద్దని ఆయన సూచించారు. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున పార్టీ నేతలంతా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కేటీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు.