ఒకవైపు మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు టీఆర్‌ఎస్ – బీజేపీ నాయకులు మాటల తూటాలతో దాడి చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి క్విడ్ ప్రొకోకు పాల్పడ్డారని, ఆయన కంపెనీకి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు రావడం పక్కా క్విడ్ ప్రొకోనే అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా 6 నెలల క్రితం తన కంపెనీకి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు వచ్చిందని కోమటిరెడ్డి స్వయంగా వెల్లడించారు. తన కంపెనీ ఓపెన్ బిడ్డింగ్‌లో పాల్గొని ఈ కాంట్రాక్టును దక్కించుకుందని ఆయన చెప్పారు. ఈ వీడియోను టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఇదే వీడియోను తన ట్వీట్‌కు జత చేసిన కేటీఆర్… రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కినందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని తెలిపారు. ఇది క్విడ్ ప్రొకో కాక మరేమిటని కూడా ఆయన ప్రశ్నించారు. తన కంపెనీకు 18 వేల కోట్ల కాంట్రాక్టు దక్కిందంటూ ఆరు నెలల క్రితం కోమటిరెడ్డి ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు కేటీఆర్. రాజగోపాల్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కూడా కేటీఆర్ చురక అంటించారు. వెంకటరెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి బాటలోనే సాగితే మంచిదని సెటైర్ వేశారు. తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలపై రాజగోపాల్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. కేటీఆర్‌కు తాను 24 గంటలు టైం ఇస్తున్నానని, క్విడ్ ప్రో కో సంబంధించి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని బదులిచ్చారు. మరోవైపు మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టులు తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి కూడా ఒప్పుకున్నారని, ఆయన దొరికిపోయిన దొంగ అంటూ విమర్శించారు. కాంట్రాక్టు వచ్చిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని, ఆయన స్వార్థం వల్లే ఉపఎన్నిక వచ్చిందన్నారు. అయితే తాను అక్రమ పద్దతుల్లో కాంట్రాక్టు దక్కించుకున్నానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని జగదీశ్‌రెడ్డికి సవాల్ విసిరారు రాజగోపాల్‌రెడ్డి