కూసుకుంట్ల అత్యంత పేద అభ్యర్థి

By KTV Telugu On 20 October, 2022
image

మునుగోడులో ముగ్గురు అభ్యర్థుల ఆస్తిపాస్తులు ఎంత ?

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌…ఈ మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరి ఆస్తి ఎంతో తెలుసా ? ఎన్నికలంటేనే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓటర్లకు పోటా పోటీగా డబ్బులు పంచాలి. అందుకే డబ్బులు దండిగా ఉన్నవారికే పార్టీలు టికెట్లిస్తున్నాయి. మునుగోడులో పోటీలో ఉన్న ముగ్గురి ఆస్తిపాస్తులు పరిశీలిస్తే మిగతా ఇద్దరికంటే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఫస్ట్‌ ప్లేస్‌ లో ఉన్నారు.
ఆయన పేరు మీద మొత్తం రూ. 222.66 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2018తో పోల్చితే రాజగోపాల్‌ రెడ్డి ఆస్తి రూ. 24.55 కోట్లు పెరిగింది. అయితే తనకు రూ. 61.54 కోట్ల అప్పు కూడా ఉంది అని ఆయన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. బ్యాంకులు, ఇతర వ్యక్తుల దగ్గర నుంచి ఈ మేరకు అప్పు తీసుకున్నట్లు వివరించారు. రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పేరుతో రూ. 52.44 కోట్ల ఆస్తి ఉంది. 2018లో రాజగోపాల్ రెడ్డి పేరుతో రూ. 24.55 కోట్ల ఆస్తులు, భార్య పేరుతో రూ. 289.75 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ, ఈ సారి రాజగోపాల్ ఆస్తులు భారీగా పెరగగా.. ఆయన భార్య పేరుతో ఉన్న ఆస్తులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇద్దరి ఆస్తులు కలిపితే 2018 కంటే ఇప్పుడు రూ. 38 కోట్ల మేర తగ్గిపోయినట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తన మొత్తం ఆస్తులు రూ. 25.61 కోట్లుగా పేర్కొన్నారు. ఆమె పేరుపై రూ. 65.23 లక్షల చరాస్తులు, రూ. 24.96 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తన భర్తతో కలిపి రూ. 1.23 కోట్ల చరాస్తులు, రూ. 39.77 కోట్ల స్థిరాస్తులు మొత్తం రూ. 41 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన భార్యతో కలిపి రూ. 7.73 కోట్ల స్థిరాస్తులు, రూ. 6 కోట్ల చరాస్తులు.. మొత్తం కలిపి రూ. 13.78 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి పేరుతో రూ. 3.78 కోట్ల చరాస్తులు, రూ. 3.89 కోట్ల స్థిరాస్తులు మొత్తం రూ. 7.68 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక ప్రభాకర్ రెడ్డికి రూ. 1.78 కోట్ల అప్పులు, ఆయన భార్య అరుణకు రూ. 22.92 లక్షల అప్పు ఉన్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఆస్తుల కంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆస్తులు తగ్గిపోయాయి. 2018లో ఆయనకు రూ. 19.28 కోట్ల ఆస్తులు ఉండగా.. ఇప్పుడు రూ. 13.78 కోట్లకు తగ్గిపోయింది. ఈ లెక్కన
మిగతా ఇద్దరితో పోలిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే పేదవాడిగా భావించాలేమో.