బీజేపీలో బంగారు లక్ష్మణ్ తర్వాత మరో లక్ష్మణ్ జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవలకపోయినా లక్ష్మణ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడవుతున్నారు. ప్రస్తుతం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌కు పార్టీ రాజ్యసభకు అవకాశం కల్పించిది. తెలంగాణ నుంచి బీజేపీలో ఒక్కరికి చాన్స్ ఇస్తారని గతంలోనే తేలింది. ఎవరు ఆ అదృష్టవంతులు అన్న చర్చ కూడా జరిగింది. లక్ష్మణ్, విజయశాంతి, మురళిధర్ రావుల్లో ఒకరికి చాన్స్ దక్కుతుందని అనుకున్నారు. ఆయనకు కాకపోతే విజయశాంతికి ఇస్తారనుకున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కె. లక్ష్మణ్‌కు చాన్సిచ్చింది.
“మున్నూరు కాపు” ఓటు బ్యాంకే లక్ష్యం!
వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మున్నూరుకాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆ వర్గం టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉందని భావిస్తున్న బీజేపీ.. దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లక్ష్మణ్‌కు చాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపులు రాజకీయ పార్టీల జయాపజయాలు నిర్ణయిస్తారు. కేసీఆర్ ప్రభుత్వానికి మున్నూరు కాపులతో పాటు గౌండ్లు, కుర్మ యాదవులు, పద్మశాలీలు, గంగపుత్రులు, ముదిరాజుల సపోర్టు ఉంది. కే కేశవరావు, బొంతు రామ్మోహన్, వినయ్ భాస్కర్, జోగు రామన్న ఇలా చాలా మంది మున్నూరు కాపు నేతలు టీఆర్ఎస్లో ప్రాధాన్యం దక్కించుకున్నారు.
మున్నూరు కాపులను టీఆర్ఎస్ పట్టించుకోవడం లేదని ఇతర పార్టీల వ్యూహాత్మక ప్రచారం !
నిజామాబాద్ డీఎస్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వరకూ బాగానే ఉన్నా.. తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఆయన కుమారుడు అర్వింద్ రాజకీయ ఎంట్రీతో మున్నూరుకాపులు రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది. కరీంనగర్లో ఎంపీగా బండిసంజయ్ గెలవడానికి మున్నూరు కాపుల ఏకపక్ష మద్దతే కారణం అని భావిస్తున్నారు. గ్రేటర్ మేయర్ పీఠం రెండు సార్లు మున్నూరుకాపులకు ఇచ్చినా…. ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్ ను నియమించినా.. ఆ కులంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి మాత్రం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రాధాన్యం ఇస్తున్న టీఆర్ఎస్!
అయితే కేసీఆర్ మున్నూరు కాపు సామాజికవర్గాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. తాజాగా రాజ్యసభకు గాయత్రి రవికి చాన్సిచ్చారు. ఆయన ప్రమాణస్వీకారానికి ఆ సామాజిక వర్గ సంఘాలను ఢిల్లీ తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ మున్నూరు కాపుల పాలిట దేవుడని మంత్రి గంగుల కమలాకర్ చెబుతున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలప్పటి నుంచి మున్నూరు కాపు ఓట్లు బీజీపీ వైపు ఉన్నట్లు టీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గెలవటం.. దుబ్బాక, హుజూరాబాద్ లో మున్నూరుకాపు ఓట్లు బీజీపీకి పోలరైజ్ కావటంతో ఈ ఓటు బ్యాంక్ పై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే బీజేపీ లక్ష్మణ్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఏ రాజకీయ పార్టీకి అయినా ఓటు బ్యాంక్ కీలకం. అలాంటి ఓటు బ్యాంక్ ఓ సామాజిక వర్గం ఏకపక్ష మద్దతు ఇస్తేనే సాధ్యం అవుతుంది. అన్ని రాజకీయపార్టీలకు అదే ప్లస్ పాయింట్. బీజేపీ తెలంగాణకి ఇప్పటి వరకూ అలాంటి ప్లస్ పాయింట్ లేదు. ఇప్పుడు మున్నూరు కాపుల్ని అలా ఓటు బ్యాంక్‌గా చేసుకుని.. బలపడాలని ప్రయత్నిస్తోంది. దీనికి టీఆర్ఎస్.. కాంగ్రెస్ ఎలా కౌంటర్ ఇస్తాయన్నది వేచి చూడాలి.