ఫారిన్‌కంట్రీ కాదు..మన పక్కా లోకల్సే!
వెస్ట్రన్ కల్చర్ భారత్‌లో కూడా చలేగా!
ఏవిటో.. ఉండేకొద్దీ మనం కూడా వెస్ట్రన్ కల్చర్‌కి మారిపోతున్నాం. పార్టీలు, పబ్బులు, లివింగ్ టుగెదర్ స్టేజ్ దాటిపోతున్నాం. స్వలింగసంపర్కాల గురించి గొంతెత్తో సమూహం పెరుగుతోంది. వివాహబంధం అంటే స్త్రీ పురుషుల మధ్యేనన్న గీటు చెరిగిపోతోంది. సంస్కృతి సంప్రదాయాలమీద ఇప్పటికీ కొందరు అరిచి గోలపెడుతున్నా అధునాతన భావాలున్న యువత వాటిని చెవులకు ఎక్కించుకోవడంలేదు. ఆధునిక భావ చైతన్యం కాస్త ఎక్కువగానే ఉండే కేరళలో ఇద్దరమ్మాయిలు చట్టం సాక్షిగా ఒక్కటయ్యారు.
కేరళకు చెందిన లెస్బియన్ జంట అదిలా నసరీన్, ఫాతిమా నూరా జంట ఓ ఇంటివారయ్యారు. బీచ్‌లో ఘనంగా జరిగిన పెళ్లి వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. స్కూల్‌లో చదువుకునే సమయం నుంచే వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఆ సాన్నిహిత్యం ఒకరినొకరు ఇష్టపడేదాకా వెళ్లింది. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంతగా బంధం బలపడటంతో కలిసి జీవించాలనుకున్నారు. కానీ ఏ తల్లిదండ్రులైనా ఎందుకు సరేనంటారు. వారి విషయంలో కూడా అదే జరిగింది. సమాజంలో తమ పరువు పోతుందని రెండు కుటుంబాల పెద్దలూ ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది మేలో ఈ జంట కోజికోడ్ పారిపోయి ఓ ఆశ్రమంలో తలదాచుకున్నారు.
అమ్మాయిలిద్దరూ ఇంటినుంచి వెళ్లిపోవటంతో వారి డిమాండ్‌కి సరేనన్న తల్లిదండ్రులు నచ్చజెప్పి ఇళ్లకు తీసుకెళ్లారు. తర్వాత అది కుదిరేపని కాదని మాట మార్చేశారు. దీంతో తన ప్రేమను దక్కించుకునేందుకు నస్రీన్ హైకోర్టును ఆశ్రయించగా ఇద్దరికీ కలిసి బతికే హక్కు ఉందని న్యాయస్థానం తీర్పు చెప్పింది. చట్టబద్దమైన చిక్కులు వీడటంతో వీరుంటున్న ఆశ్రమ నిర్వాహకులే బీచ్‌లో వేడుకకు ఏర్పాట్లు చేశారు. అమ్మాయిలిద్దరూ ఉంగరాలు మార్చుకుని ఒక్కటయ్యారు. స్వలింగ సంపర్క వివాహాలకు మన దేశంలో ఇంకా చట్టబద్దత లేదు. అయితే కొందరు స్వలింగ సంపర్కులు మాత్రం కట్టుబాట్లను లెక్కచేయకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొత్త ట్రెండ్‌కి తామే రోల్‌మోడల్స్ అంటున్నారు.