తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడన్నీ యాత్రా స్పెషల్సే… నేతలంతా పాదయాత్ర చేస్ందుకు తహతహలాడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రాష్ట్ర యాత్రకు రెడీ అవుతున్నారు. కాలికి బల్పం కట్టుకుని నడిస్తే వచ్చే లాభమేంటి. ఓ సారి చూద్దాం…
జనవరి నుంచి లోకేష్ పాదయాత్ర. 400 రోజులు ఏకధాటిగా నడవబోతున్న యువనేత.
అసెంబ్లీ ఎన్నికల వరకు జనంలోనే ఉండే ప్రయత్నం. ప్రతీ నియోజకవర్గంలో మూడు రోజుల టూర్.
పాదయాత్రికుల జాబితాలో చంద్రబాబు తనయుడు చేరబోతున్నారు. 2024లో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా 400 రోజులు నడవబోతున్నారు. తన తండ్రి నియోజకవర్గం కుప్పంలో జనవరి 27న మొదలయ్యే యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుంది. 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు ఆయన నడుస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుస్తారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో నడిచే విధంగా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది.
రాహుల్, షర్మిల యాత్రలు సక్సెస్. గతంలో పాదయాత్ర చేసి అధికారానికి వచ్చిన నేతలు.
టీడీపీ హామీలు ప్రజల్లోకి చేరేందుకే యాత్ర. వైసీపీ తీరును ఎండగట్టే అవకాశం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాదయాత్రలు చేశారు. అధికారంలోకి వచ్చారు. అదే స్ఫూర్తిగా పాదయాత్ర చేయాలని లోకేష్ అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న పాదయాత్రలకు విశేష స్పందన లభిస్తోంది. పైగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉండటంతో జనంలో ఉండేందుకు యాత్ర తగిన ఆయుధమని టీడీపీ నిర్ణయానికి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామని చెప్పేందుకు పాదయాత్ర ఉపయోగపడుతుందని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. పాదయాత్ర పేరు కూడా యవత అని అర్థం వచ్చేలా పెట్టబోతున్నారు. వైసీపీ పాలనలో జనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతీ ఒక్కరికీ వివరించి తాము అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరించబోతున్నామని చెబుతారు.
పప్పు ఇమేజ్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న లోకేష్. రాజకీయాల్లో రాటుదేరారని విశ్లేషణలు.
హైదరాబాద్ వదిలి ఏపీ జనంలో ఉంటున్న యువనేత. ఏపీ భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన.
లోకేష్ ను వ్యతిరేక వర్గం పప్పు అని పిలుస్తోంది. గతంలో ఆయన చేసిన పనులు కూడా అలాగే ఉండేవి. ఇటీవలి కాలంలో ఆయన పప్పు ఇమేజ్ నుంచి క్రమంగా బయట పడుతున్నారు. ఆచి తూచి మాట్లాడటంతో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ వదులుతున్నారు. ఆ దిశగా రాజకీయాల్లో రాటుదేలారు. హైదరాబాద్ లో ఉండకుండా ఊళ్ల వెంబడి తిరుగుతూ జనం మనిషినని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏపీలో ఏ చిన్న సమస్య తలెత్తినా అక్కడ వాలిపోయి టీడీపీ మీ వెంట ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇలాంటి చర్యలు పార్టీ పటిష్టతకు ఉపయోగపడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జగన్, పవన్ తో పోటీ పడగలరా.
లోకేశ్ ను జనం ఆదరిస్తారా. చంద్రబాబు నీడ నుంచి బయటకు రాగలరా.
ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ పవర్ ఫుల్ లీడర్. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సరే. సంక్షేమ పథకాలతో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ గెలవకపోయినా పవర్ ఫుల్ ఆరేటర్. అలాంటి ఇద్దరు నేతలతో పోటీ పడి లోకేష్ నెగ్గుకు రావాలి. పాదయాత్రలో జనాకర్షణ పథకాలను ప్రస్తావించడంతో పాటు పేద, అల్పాదాయ వర్గాలను ఆకట్టుకునే ప్రసంగాలు చేయాలి. పైగా లోకేష్ ఇప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగానే కొనసాగుతున్నారు. ఆ చట్రం నుంచి బయట పడాలంటే పాదయాత్ర ఒక్కటే సరైన మార్గమని భావించి ఉండొచ్చు. మరో రకంగా చెప్పాలంటే పాదయాత్ర ఒక అనుభవం. జిల్లాల వారీగా జనం ఎదుర్కొనే సమస్యలను తెలుసుకునే సాధనం. సూక్ష్మ స్థాయిలో ప్రజా సేవకు అవకాశం పొందే అయుధం. లోకేష్ ఆ దిశగా ఆలోచిస్తారో లేదో చూడాలి.