జగన్‌కు తీపికబురు అందించిన కేంద్రం
బందర్ ఓడరేవు నిర్మాణానికి ముందడుగు
రూ.3,940 కోట్లు నిధులు మంజూరు
ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో జగన్ బాగా తెలుసుకున్నారు. మోడీ వద్ద పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో బాబు లాగా ఘర్షణలకు వెళ్లకుండా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తప్ప తమకు మరో అజెండా లేదంటున్న ఏపీ సీఎం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం మోడీతో బంధం మరింతగా పెనవేసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా మెలుగుతూ వారికి అవసరమైన మేరకు మద్దతు ఇస్తున్నారు. అదేసమయంలో కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలని విభజన హామీలు నెరవేర్చాలని కోరుతున్నారు. ప్రత్యేకహోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్ సహా అనేక అంశాల్లో పలుమార్లు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిన జగన్. ఇటీవల విశాఖ కేంద్రంగా తమ హక్కులు నెరవేర్చాలని మరోసారి మోడీకి విన్నవించారు. అయితే జగన్ ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి ఆదరణ దక్కడం లేదు. ఈ పరిణామాల మధ్య కేంద్రం జగన్ సర్కార్‌కు ఓ తీపికబురు అందించింది.
ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయి. రూ. 3,940 కోట్ల రూపాయల మేర రుణాన్ని మంజూరు చేసింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇటీవలే హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. తాజాగా పోర్టు వ్యయానికి అవసరమయ్యే వందశాతం రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేయడంతో ప్రభుత్వం వేగం పెంచనుంది. త్వరలోనే సీఎం జగన్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో నిర్మాణ పనులకు శిలాఫలకం పడొచ్చనే అంచనాలు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మేజర్ ప్రాజెక్ట్ అయిన మచిలీపట్నం ఓడరేవు నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పోర్ట్ నిర్మాణానికి అవసరమైన రోడ్ కనెక్టివిటీని కల్పించే దిశగా రోడ్లు-భవనాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైలు, రోడ్ కనెక్టివిటీ కోసం ఎంత భూమిని సేకరించాలనే విషయం మీద ఇదివరకే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ అయినట్లు చెబుతున్నారు.
రాష్ట్రానికి వరప్రదాయినిగా చెప్పుకొంటోన్న పోలవరం ప్రాజెక్ట్ కోసం కూడా కేంద్రం నుంచి నిధులను సమీకరించే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారు. పోలవరం నిర్మాణానికి వ్యయం చేసిన వేల కోట్ల రూపాయల మేర నిధులు కేంద్రం నుంచి తెప్పించుకునే పనిలో ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు వైఎస్ జగన్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను కలిశారు. వచ్చే ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న జగన్ రాష్ట్ర హక్కులను ఒక్కొక్కట్టిగా సాధించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. విభజనతో అన్యాయమైన రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఆదుకోవాలని మోడీని వేడుకుంటున్నారు. కీలక సమస్యల్ని ఎప్పటికప్పుడు మోడీ ముందు ఏకరవు పెడుతున్నారు. జగన్ కోరికల చిట్టాలో కొన్నింటికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నప్పటికీ విభజన హామీలపై మాత్రం ఎప్పటికప్పుడు దాటవేత ధోరణితో వెళ్తోందనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్లు చెప్పాల్సింది వాళ్లు చెబుతారు, మనం చేయాల్సింది మనం చేద్దామంటూ ఇటీవల ఏపీ బీజేపీ నేతల వద్ద మోడీ చేసిన వ్యాఖ్యలను పలువురు గుర్తు చేస్తున్నారు.