నేపాల్ వరుస భూకంపాలు మనకిస్తున్న సందేశాలేమిటి? హైదరాబాద్ కు భూకంప ప్రమాదం పొంచి ఉందా ? గతంలో హైదరాబాద్ ప్రజలు వణికిపోయారా ? తెలుగు రాష్ట్రాలూ భూకంప జోన్ లో ఉన్నాయా ?
నేపాల్ లో భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు. దోతి జిల్లాలో పదుల సంఖ్యలో మరణాలు. ఢిల్లీలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం. నేపాల్ తాజా భూకంపం భారతీయుల భయాందోళనలకు కారణమైంది. రిక్టర్ స్కేలుపై 6 పాయింట్ మూడుగా నమోదైన భూకంప ప్రభావం భారత రాజధాని ఢిల్లీపై కూడా ప్రభావం చూపింది. భూప్రకంపనల ధాటికి నేపాల్ దోతి జిల్లాలో ఇళ్లు కూలి పదుల సంఖ్యలో జనం చనిపోయారు. భూకంపం సంభవించిన వెంటనే ఢిల్లీ సహా పలు ప్రాంతంలో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బిల్డింగులు ఊగిపోయినా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 20 వేల భూప్రకంపనలు
సెస్మోగ్రాఫ్ లో కూడా నమోదు కాని తేలికపాటి భూకంపాలు. టోక్టోనిక్ ప్లేట్లు కదలడంతో భారీ ప్రకంపనలు. భారత్ లో 82 శాతం మంది భూకంప ప్రభావిత ప్రాంతాల్లోనే జీవనం. ఈ భూప్రపంచం నిత్యం ప్రకృతి వైపరిత్యాలకు కేంద్ర బిందువుగానే ఉంటోంది. సునామీల నుంచి భూకంపాల దాకా తరచూ సంభవిస్తూనే ఉంటాయి ప్రతి సంవత్సరం 20 వేలకు పైగా భూకంప ప్రకంపనలు నమోదవుతున్నాయని భూభౌతిక శాస్త్ర నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రకంపనలు చాలా వరకు బయటకు రావు. ఇవి చాలా తేలికపాటివి. ఇవి సెస్మోగ్రాఫ్లో కూడా నమోదు కావు. భూగర్భంలో ఉండే ఏడు టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల భూకంపం సంభవిస్తోంది. భారత్ లో 56 శాతం ప్రాంతం భూకంప ప్రభావిత జోన్ లోనే ఉంది. దేశ జనాభాలో 82 శాతం మంది ఈ ప్రాంతాల్లోనే ఉంటున్నందున ఒకసారి భారీ భూకంపం సంభవిస్తే లక్షలాది ప్రాణాలు పోయే ప్రమాదం ఉందనే చెప్పాలి..
తెలుగు రాష్ట్రాల్లోనూ భూకంపాలు
ఐదు సంవత్సరాల్లో రెండు సార్లు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ప్రకంపనలు. ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవడంతో హ్యాపీ. 2017 నవంబరు 15న హైదరాబాద్ లో భూకంపం సంభవించింది. జూబ్లి హిల్స్ ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించి జనాన్ని పరుగులు పెట్టించాయి. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చిన భూకంప ప్రభావం జూబ్లీ హిల్స్ తో పాటు బంజారా హిల్స్, రెహమత్ నగర్, బోరబండలో భూకంపం వచ్చినట్లు జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ వెల్లడించింది. భూగర్భ జలాలు పెరిగినందునే ప్రకంపనలు సంభవించాయని అప్పట్లో గుర్తించారు. రిక్టర్ స్కేలుపై అది సున్నా పాయింట్ ఐదుగానే నమోదైంది. ఇక 2021లో . హైదరాబాద్కు 156 కిలోమీటర్ల దూరంలో నాగర్ కర్నూల్ జిల్లాలో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతు వరకు భూకంపం ప్రభావం చూపించింది. అమ్రాబాద్, అచ్చంపేట, ఉప్పునుంతలలో భూప్రకంపనలు సంభవించాయి. భయభ్రాంతులకు గురై జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పొరల్లోకి నీరు చేరుకోవడం వల్ల భూప్రకంపనలు వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు.
భారీ వర్షాలతో భూకంపాలు సంభవించే అవకాశం
హైదరాబాద్ కు ప్రమాదం లేనట్టే. సెస్మిక్ జోన్ -2లో ఉన్న భాగ్యనగరం. సేఫ్ జోన్లోనే ఉన్న తెలుగు రాష్ట్రాలు. దక్షిణాదిలో భారీ వర్షాలతో వరదలు వచ్చినప్పుడు భూకంపాలు సంభవించే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అలాగని హైదరాబాద్ లో వర్షాకాలం భూకంపాలు వస్తాయని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే హైదరాబాద్ భూకంప కేంద్రాలకు దూరంగా ఉండే ప్రాంతం. సెస్మిక్ జోన్ లెక్కల ప్రకారం కూడా ఆ అంశం నిరూపితమైంది హైదరాబాద్ నగరం సెస్మిక్ జోన్ టూ లో ఉండటం వల్ల భూకంపాలు సంభవించడానికి అవకాశం లేదు. పదేళ్లకో ఇరవయ్యేళ్లకో ప్రకంపనలు వచ్చినా వాటి వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అందుకే ఆకాశమంత ఎత్తైన భవనాలు నిర్మించుకోవడానికి ఇబ్బందీ ఉండదు. తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం ప్రాంతాలు సెస్మిక్ జోన్ టూలోనే ఉన్నాయి. అందుకే హైదరాబాదీలు డోన్ట్ ఫీయర్. మీకు గానీ, గ్రామాల్లో ఉన్న మీ బంధుమిత్రులకు గానీ భూకంప భయం లేదు.