రెడ్డి ఫైట్… అధికారం కోసం ప్రయత్నాలు

By KTV Telugu On 30 May, 2022
image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎన్టీయార్ ప్రభంజనానికి ముందు, ఆ తర్వాత కూడా రెడ్లదే ఆధిపత్యం. చెన్నారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రెడ్లు ముఖ్యమంత్రిత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారే. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెడ్ల ఆధిపత్యానికి గండి పడింది. కేసీయార్ ప్రభంజనంలో రెడ్లు డీలా పడిపోయారు. ఇప్పుడు మళ్లీ పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధికారం కోసం కొత్తదారులు వెదుకుతున్నారు. తమ మధ్య ఐకమత్యం లేదని మాత్రం బయటకు ఒప్పుకోలేకపోతున్నారు..

మల్లారెడ్డిపై రెడ్ల ఆగ్రహం

వేర్వేరు పార్టీల్లో రెడ్లు చెల్లాచెదురుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కువ మంది రెడ్లు ఉన్నారు. కాంగ్రెస్ రెడ్డి పార్టీ అని కూడా గుసగుసలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ మంత్రి చామకూర మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రెడ్ల సింహగర్జన సభలో ఆయనపై రెడ్డి కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి.. తన ప్రసంగంలో పదే పదే సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ ను పొగుడుతూ మాట్లాడటంపై మండిపడ్డారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు ఆగ్రహించిన మంత్రి.. మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆయన వాహనంపై కుర్చీలు, వాటర్‌ బాటిళ్లతో దాడి చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటే ఆదివారం వివాదానికి కారణమైంది. రూ. 5 కోట్లతో ఏర్పాటు చేయాలనుకున్న రెడ్డి కార్పొరేషన్ ఏమైందని జనం మల్లారెడ్డిని నిలదీశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటవుతున్నాయని మల్లారెడ్డి ప్రకటించారు. అంతటితో వదిలేస్తే బావుండేది. మళ్లీ టీఆర్ఎస్సే అధికారానికి వస్తుందని మల్లారెడ్డి ప్రకటించడం.. అధికార పార్టీని వ్యతిరేకించే రెడ్డకు నచ్చలేదు. వాళ్లు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మల్లారెడ్డిపై దాడికి కూడా యత్నించారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు విశ్రమించేది లేదని రెడ్డి జేఏసీ ప్రకటించింది.

రేవంత్ రెడ్డి చేయించారా.. ?

24 గంటలు గడవకముందే కౌంటర్ అటాక్ మొదలైంది. తనపై రేవంత్ రెడ్డి దాడి చేయించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు సంధించారు  రెడ్ల ముసుగులో కొందరు రౌడీలను పంపి రేవంత్ రెడ్డి రచ్చ చేయించారని మల్లారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. నిజానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో లేరు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. అయినా మల్లారెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. వారిద్దరి మధ్య మల్కాజ్ గిరి పంచాయతీ ఉంది. రేవంత్… మల్కాజ్ గిరి ఎంపీగా గెలవడం మంత్రి మల్లారెడ్డికి పెద్ద షాక్. అప్పటి నుంచి రేవంత్ తన ఇలాకాలో ఓవరాక్షన్ చేస్తున్నారని మల్లారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. పైగా రేవంత్ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఆయన మల్లారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. మల్లారెడ్డి అవినీతిపరుడని ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా మెడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు రేవంత్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో వేరే రెడ్ల ఆధిపత్యం ఉండటంతో రేవంత్ అటు వైపు తన ప్రాబల్యాన్ని పెంచుకోలేని పరిస్థితి ఉంది. దానితో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ రెడ్లు, వర్సెస్ టీఆర్ఎస్ రెడ్ల సంఘర్షణ తారా స్థాయికి చేరే అవకాశాలే ఉన్నాయి….