కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చేందుకే మల్లికార్జున్ ఖర్గే అధ్యక్ష పదవిని చేపట్టారా ? ఖర్గే ముందున్న సవాళ్లు ఏమిటి ? యువ నేత రాహుల్ గాంధీతో ఆయన పొలిటికల్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ? ఆ ఇద్దరు నేతలు హిట్ కాంబినేషన్ అవుతారా ? మోదీ దూకుడును అడ్డుకోగలరా ? ఓ సారి చూద్దాం ….
మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా . పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు, సంఘీభావాలు చెప్పడం పూర్తయింది . ఇకపై అసలు కార్యాచరణ మొదలవుతుంది. పార్టీని గాడిలో పెట్టే చర్యలకు ఉపక్రమించాల్సిన తరుణం కూడా వచ్చేసింది. అందరినీ కలుపుకు పోతూ, అందరికంటే డిఫరెంట్ గా ఉండే నాయకుడినని నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలు ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే ఉండటంతో సమయం లేదు మిత్రమా.. అంటూ సరికొత్త వ్యూహాలు రచించాల్సిన అనివార్యత ఏర్పడింది.
24 ఏళ్ల తర్వాత నెహ్రూ కుటుంబ కాని నేతకు అవకాశం…
24 ఏళ్ల తర్వాత నెహ్రూ -గాంధీ కుటుంబ సభ్యులు కాని నేతకు అధ్యక్ష పదివిని చేపట్టే అవకాశం రాగా.. మల్లిఖార్జన్ ఖర్గే తన సత్తాను నిరూపించుకంటేనే ఇతర నేతల పోటీని తట్టుకునే వీలంటుంది. సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురు పోటీకి దూరంగా ఉండడం వల్లే తనకు అవకాశం వచ్చిందని ఖర్గే మరిచిపోకూడదు. సోనియాకు విధేయుడిగా ఉండటం వల్లే ఆయన నెగ్గారన్నది బహిరంగ రహస్యం దానితో ఇప్పుడు నొప్పించక తానొవ్వక అన్నట్లుగా ఖర్గే ఎంతో నేర్పుగా వ్యవరించాల్సి ఉంటుంది.
ఖర్గే తనకు దిశానిర్దేశం చేయాలంటున్న రాహుల్
కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ వద్దనుకున్నారు. అందుకే ఖర్గేకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు పాదయాత్ర చేస్తున్న రాహుల్… కొత్త అధ్యక్షుడికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీలో తన విధులను కూడా ఖర్గే నిర్దేశిస్తారని ప్రకటించిన రాహుల్… ఎవరైనా అధ్యక్షుడి తర్వాతేనని చెప్పకనే చెప్పారు. ఖర్గే నాయకత్వంలో పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని రాహుల్ ప్రకటించినట్లయ్యింది. అయితే కాంగ్రెస్ లో ఉన్న గ్రూపులన్నింటినీ ఒక తాటిపై తీసుకురావాల్సిన అవసరం ఖర్గేకు ఉంది. కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకుంటూ పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. పైగా గులాం నబీ ఆజాద్ లాంటి అనుభవజ్ఞులైన నేతలు పార్టీని వీడి వేరు కుంపటి పెట్టుకున్నారు. జీ – 23 నేతల తిరుగుబాటు తాలూకు ఛాయలు ఇంకా పార్టీపై ఉంది..
జంట కవుల్లా పనిచేయాల్సిన ఖర్గే, రాహుల్
ఖర్గే నిజంగానే చేవ వున్న నేత. దొడ్డి దారిన వచ్చిన నాయకుడు కాదు.. ఆయన ప్రత్యక్ష ఎన్నికలలో 12 సార్లు పోటీ చేసి, 11 సార్లు గెలుపొందారు. శ్రమించి సాధించాలనుకునే నాయకుడు రాహుల్ గాంధీ … పార్టీలో కొందరు పెద్దలు పనిచేయకుండా ఎంజాయ్ చేస్తున్నారని గ్రహించి… అధ్యక్ష పదవికి దూరంగా జరిగిన నాయకుడు రాహుల్. ఇకపై ఖర్గే, రాహుల్ కలిసి పనిచేయాలి. ఖర్గే పాతతరం నాయకుడిగా కనిపించినా… కొత్త తరంతో ఎలా కలిసిపోవాలో తెలిసిన దార్శనికుడని….. ఆయన సన్నిహితులు చెబుతారు. రెండు తరాలను అనుసంధానం చేసుకుంటూ.. విధుల బట్వాడా ద్వారా పార్టీని బలోపేతం చేయడమే ఇప్పుడు ఖర్గే ముందున్న సవాలు. పాతతరం నేతలు పెత్తందారీతనానికి అలవాటు పడ్డారన్న ఆరోపణల మధ్య అందరూ కాంగ్రెస్ కార్యకర్తలే అన్న ఆలోచనా ధోరణిని అలవాటు చేయాలి.. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పార్టీ మనుగడ సాధ్యమని సీనియర్లకు వివరించాలి. అదే ఖర్గే ముందున్న అసలు సవాలు.
మోదీ వేగానికి కాంగ్రెస్ బెంబెలు
బీజేపీ నాయకుడైన ప్రధాని నరేంద్ర మోదీ వేగానికి కాంగ్రెస్ అల్లాడిపోతున్న రోజులివి. మోదీ దెబ్బకు.. కాంగ్రెస్ కకావికలమైపోతున్న వేళ … దేశంలో ఆయనతో సరితూగే నాయకుడు లేడని చెబుతున్నారు. ఖర్గే ముందున్న రెండో సవాల్ అదే. మోదీకి తానే పోటీ అవుతానని కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు నిరూపించుకోవాలి. ఇప్పటికే రాహుల్ తన వంతుగా మోదీపై పోరాడుతున్నారు. ఇద్దరు కలిస్తే ఆ పోరాటానికి మరింత సార్థకత చేకూరుతుంది. మోదీ ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన కోసం పనిచేసే బ్యాకప్ టీమ్ చకచకా పనులు చేసుకుని పోతుంది. కాంగ్రెస్లో మాత్రం అంతర్గత కుమ్ములాటతో ఎవరికీ వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న సంగతి ఖర్గే కూడా మరిచిపోకూడదు.ఆ దిశగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. హిందూత్వ విధానాలతో దేశ ప్రజలను పూర్తిగా తమ వైపుకు తిప్పుకున్న బీజేపీని దెబ్బకొట్టాలంటే.. సెక్యూలర్ వాసనలను పూర్తిగా పోగొట్టుకోకుండా హిందూవాదాన్ని కూడా నెత్తికెత్తుకోవాలి. ఆలయాలకు వెళ్లడం, మఠాలను సందర్శించడం లాంటి చర్యలతో రాహుల్ కొంత మేర అలాంటి ప్రయత్నాలకు దిగినందున… ఖర్గేకు మార్గాన్వేషణ కష్టం కాకపోవచ్చు…