కాదంటే అవుననిలే.. మెగా స్టార్ రూటే సెపరేటులే

By KTV Telugu On 21 November, 2022
image

మెగా స్టార్ చిరంజీవి పాడిందే పాట పాడుతున్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రస్తక్తే లేదంటున్నారు. జనం అడిగినా అడకపోయినా ఆయన తన మనో ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అలా మాట్లాడటానికి ఏదో కారణం ఉందనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్

నేను రాను.. మా తమ్ముడిని వాడేసుకోండి
రాజకీయాల్లో మొరటుగా ఉండాలి, రాటు తేలాలంటున్న చిరంజీవి
నాలుగు మాటలు అనాలి, అనిపించుకోవాలంటున్న మెగాస్టార్
రాజకీయాలకు పవన్ తగిన వాడు – చిరంజీవి
చిరంజీవి నిజం మనసులో మాట చెప్పలేదా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం అయ్యే ఛాన్స్ వచ్చిందా ?
జగన్ పిలిచి రాజ్యసభ సీటు ఇస్తారనుకున్నారా ?
ఇంకా కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతున్న చిరంజీవి

నేను రాను.. మా తమ్ముడ్ని వాడేసుకోండని చిరంజీవి నేరుగానే చెప్పేస్తున్నారు. రాజ‌కీయాల అంతు చూడ‌లేక‌పోయాన‌ని కానీ త‌న త‌మ్ముడు ప‌వ‌న్ అలా కాద‌ని హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయ‌న చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో సున్నిత మనస్తత్వం ఉండకూడదు. బాగా మొర‌టుగా వుండాలి, రాటు తేలాల‌ని ఆయ‌న అన్నారు. నాలుగు మాట‌లు అనాలి, అనిపించుకోవాల‌ని చెప్పారు. అవ‌స‌ర‌మా ఇది? అని ప్ర‌శ్నించుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. పైగా రాజకీయాలకు పవన్ తగిన వాడన్నారు. అంటాడు అనిపించుకుంటాడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెప్పారు. అంద‌రి స‌హాయ స‌హ‌కారాల‌తో ఏదో ఒక రోజు అత్యున్న‌త స్థానంలో ప‌వ‌న్‌ను చూస్తామ‌ని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

చిరంజీవి నిజంగానే మనసులో మాట చెప్పారని కూడా అనుకోలేము. ఎందుకంటే ఒకసారి రాజకీయం రుచి చూసిన వాళ్లు దాన్ని వదులుకోలేరు. రాననుకున్నారా.. రాలేననుకున్నారా… కొంచెం గ్యాప్ వచ్చిందంటే అన్నట్లుగా ఉంటుందీ వారి ధోరణి. పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి దాకా వెళ్లొచ్చిన నాయకుడాయన. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా దక్కింది. అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డిని దించేసి చిరంజీవిని సీఎం చేసే ప్రతిపాదన ఉన్నట్లు కూడా చర్చ జరిగింది. కొందరు కాంగ్రెస్ నేతలు చిరంజీవిని కలిసి ముందస్తుగా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. కాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి అడ్డం తిరగడంతో 2014 అసెంబ్లీ ఎన్నికల వరకూ సీఎం పదవి ఖాళీ కాలేదు. చిరంజీవి ఆశ నెరవేరలేదు.

సీఎం పదవిని అలంకరించాలన్న కోరిక తీరకుండానే చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒక సందర్భంగా తనను కలవడానికి రావాలంటూ ఏపీ సీఎం జగన్ చిరంజీవి కోసం స్పెషల్ ఫ్లైట్ కూడా పంపారు. అప్పుడు వైసీపీ తరపున రాజ్యసభకు పంపుతారని చర్చ జరిగింది. చిరంజీవి దాన్ని ఖండించనూ లేదు. ఆ వార్త నిజమూ కాలేదు. సినిమా వాళ్లంతా జగన్ ను కలిసినప్పుడు చిరంజీవి ఆయన్ను ఆకాశానికెత్తేశారు. దానితో పదవిని ఆశిస్తున్నారన్న చర్చ మరో సారి మొదలైంది. వీటన్నింటి నడుమ ఇప్పుడు రాజకీయాలకు పనికి రానంటూ చిరంజీవి స్పీచ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే చెప్పాలి. నేను కూడా ఉన్నాను అని గుర్తు చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆయన గుర్తింపు కార్డు కూడా మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కు పెద్ద దిక్కు కాదు ఏ దిక్కూ లేదు. అలాంటి పార్టీకి చిరంజీవి వస్తే సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్టానం వెనుకాడకపోవచ్చు. పైగా చిరంజీవి రావడమంటే కాపు సామాజిక వర్గం మొత్తం రాజకీయంగా ఆయన వైపు తిరగడమనే చెప్పాలి. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సరైనా నాయకుడు లేడన్న చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ కు కన్సిస్టెన్సీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో పక్క చిరంజీవికి గాలం వేసేందుకు బీజేపీ కూడా ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆయనకు కేంద్రం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అన్ని అర్థమయ్యే చిరంజీవి అబ్బే లేదు..లేదు, కాదు.. కాదు.. అంటున్నారేమో.