మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఫామ్‌హౌస్ బేరసారాల వ్యవహారంపై టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు మాటల తూటాలతో దాడి చేసుకుంటున్నారు. దేవుని మీద ప్రమాణాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు విచారణలో ఉంది. మరోవైపు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని మోదీ సర్కారుపై చార్జ్ షీట్ పెట్టారు.
తెలంగాణతో పాటు దేశ యువతకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ద్రోహం చేసిందని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పటికీ లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నల్గొండలో హ్యాండ్ లూమ్ పార్క్ కడతామంటూ ఇచ్చిన హామీని కేంద్రం మరిచిందని విమర్శించారు. విభజన హామీలను ఇప్పటికీ నెరవేర్చకుండా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కూడా కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. కృష్ణా జలాల పంపకాలలో నికృష్టమైన రాజకీయం చేస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్స్ చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ఆ చార్జ్ షీట్ లో ఇంకా ఏం రాశారంటే..
నోట్ల రద్దు పేరుతో పనికిమాలిన నిర్ణయం తీసుకుని ప్రజలను ఇబ్బందుల పాలు చేశారు..కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను అవస్థలపాలు చేశారు.. 13 నెలల పాటు ఢిల్లీ రోడ్లపై అన్నదాతలు ఆందోళన చేయడానికి కారణమయ్యారు.. లఖీంపూర్ లో రైతులపైకి వాహనాలు ఎక్కించి చంపించారు అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పెట్టిన ఈ చార్జ్‌షీట్‌పై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.