కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. బీజేపీ గనక తన ఆఫర్‌కు ఒప్పుకుంటే మునుగోడు ఉప ఎన్నిక బరి నుంచి తాము తప్పుకుంటామని సంచలన ప్రకటన చేశారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి రూ.18 వేల కోట్ల నిధులు తీసుకొస్తే… తాము పోటీ నుంచి విరమించుకుంటామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మునుగోడుకు రూ.18 వేల కోట్ల నిధులు మంజూరు చేసిన వెంటనే టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తామని ఆయన చెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ను ప్రాధేయపడి అయినా తాము ఒప్పిస్తామని జగదీశ్ రెడ్డి చెప్పారు. తన సంస్థకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు దక్కిందంటూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరు నెలల క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ వెల్లడించారు. ఆ కాంట్రాక్టు కోసమే ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారని మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి కోమటిరెడ్డిపై ఆరోపణలు చేశారు. అయితే తన కంపెనీ ఆ కాంట్రాక్టు సక్రమ పద్దతుల్లోనే దక్కించుకుందని, తాము అక్రమాలకు పాల్పడినట్లు రుజవు చేస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని కోమటి రెడ్డి సవాల్ విసిరారు. అప్పటి నుంచి జగదీశ్వర్‌రెడ్డి కోమటి రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్న కేసీఆర్‌ను వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. వచ్చే ఏడాది బతుకమ్మ నాటికి కవిత తీహార్ జైలుకెళ్లడం ఖాయం అని పేర్కొన్నారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో జగదీశ్వర్‌రెడ్డి కోమటిరెడ్డికి ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి 18 వేల కోట్ల లెక్క ఏమిటి అనుకుంటున్నారా…? అది కోమటిరెడ్డి కంపెనీకి దక్కిన కాంట్రాక్టు విలువ అన్నమాట.