ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు వచ్చిన కాసు
మరో పదిరోజులకు పోస్ట్ పోన్ చేసిన యరపతినేని
ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కిన గురజాల
పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో రాజకీయం సెగలు కక్కుతోంది. గురజాలలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ విషయంలో నేతలిద్దరూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటుండడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని యరపతినేని తాను చేసిన అభివృద్ధి కనబడడం లేదా అంటూ కాసు మహేష్ రెడ్డి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందాం రావాలంటూ వారం క్రితం యరపతినేనికి కాసు సవాల్ విసిరారు. గురజాల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు వస్తానని, అక్కడికి ఎవరైనా సరే రావచ్చంటూ కాసు ప్రకటించగా యరపతినేని కూడా ఆ సవాల్‌ను స్వీకరించారు. దీంతో గురజాల రాజకీయం వేడెక్కింది.
చెప్పినట్లుగానే కాసు మహేష్ రెడ్డి నిన్న గురజాలకు చేరుకోవడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే మరో 10 రోజుల్లో అభివృద్ధిపై చర్చకు తేదీని ప్రకటిస్తానంటూ యరపతినేని ప్రకటించారు. ఆదివారంపేరుతో చర్చకు రాకుండా పారిపోయాడంటూ యురపతినేనిపై విమర్శలు గుప్పిస్తున్నారు కాసు. గురజాలలో తాము అధికారంలో ఉన్నప్పుడు రూ.1500 కోట్లతో చేసిన అభివృద్ధి పనులే తప్ప ఇప్పుడు ఏమీ జరగడం లేదని యరపతినేని అంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో తాను రూ.3వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్టు కాసు చెబుతున్నారు. గతంలో కూడ వీరిద్దరి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. గురజాల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన శ్రేణులపై దాడులు, హత్యల విషయంలో వైసీపీపై యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను కాసు మహేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
గత ఎన్నికల్లో గురజాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన కాసు మహేష్ రెడ్డి యరపతినేని శ్రీనివాసరావుపై భారీ మెజార్టీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాసు పోటీకి సిద్ధమవుతుండగా అటు యరపతినేని కూడా మహేష్ రెడ్డి టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధిపై లెక్కలతో సిద్ధంగా ఉన్న కాసు యరపతినేని ఒక్కరే వచ్చినా, ఎంతమందితో వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానంటున్నారు. యరపతినేని రమ్మంటే ఆయన ఇంటికైనా వెళ్లడానికి రెడీ అంటున్నారు. ప్రస్తుతం యరపతినేని దాన్ని మరో పదిరోజులకు పోస్ట్ పోన్ చేయడంతో ఏం జరగబోతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అప్పటివరకు ఈ వేడి చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇద్దరు నేతల సవాల్‌లపైనే చర్చ జరుగుతోంది.