రావయ్యా రఘురామా.. చెప్పాల్సింది చాలా ఉంది!

By KTV Telugu On 24 November, 2022
image

వైసీపీ ఎంపీ.. బీజేపీతో దోస్తీ.. సిట్‌ నోటీస్‌.. వారెవ్వా!
ఏపీలో అదుర్స్‌.. తెలంగాణలో బెదుర్స్‌.. ఖర్మ ఖర్మ!

శకునం చెప్పే బల్లి కుడితిలో పడితే ఎలా ఉంటుంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. ఎవరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయో తరచూ చిలకజోస్యం చెప్పే గోదావరి రాజుగారు పక్కరాష్ట్రం స్టింగ్‌ ఆపరేషన్‌ తన పీకలకు చుట్టుకుంటుందని ఊహించలేకపోయారు. ఏపీలో సీఐడీ ఎంక్వయిరీలతో తలబొప్పికట్టి హైదరాబాద్‌ సేఫ్‌ అనుకుంటున్న ఎంపీకి ఇక్కడ కొత్త పితలాటకం మొదలైంది పాపం.

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కేసులో విచిత్రంగా ఏపీ నాయకుడి పేరు తెరపైకి రావటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతూ ముగ్గురు ప్రముఖులు అడ్డంగా దొరికిపోయారు. వారికి బీజేపీ పెద్దలతో ఉన్న లింకుల రహస్యాలను ఛేదించే పనిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సమయంలోనే కేసును ఎంక్వయిరీ చేస్తున్న సిట్‌నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజుకి ప్రత్యేక ఆహ్వానం అందింది. వచ్చి ఏదన్నా రిబ్బన్‌ కట్‌ చేయమని కాదు కేసులో నిందితులతో ఆయనగారికున్న సాన్నిహిత్యం గురించి చెప్పమని.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుల‌తో ర‌ఘురామ‌ కృష్ణరాజుకి స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని సిట్ విచార‌ణ‌లో వెల్లడైంది. దీంతో నవంబరు 26న విచార‌ణ‌కు రావాలంటూ ఆయ‌న‌కు 41A సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. ఫాంహౌస్‌ కేసు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌లతో ర‌ఘురామ‌కృష్ణరాజు దిగిన ఫొటోలు తెర‌పైకి వ‌చ్చాయి. వాస్తవానికి రాజుగారికి సొంతపార్టీ (వైసీపీ) నేతలతో తప్ప దేశంలో అందరితో మంచి సంబంధాలే ఉన్నాయి. ఫాంహౌస్‌ కేసు నిందితులతో హలో అంటే హలో అనే సంబంధాలేనా, అంతకుమించి ఆయన ప్రమేయం ఉందా అన్నది సిట్‌ విచారణలో తేలబోతోంది.

విచారణలో ఏపీ సీఐడీ అధికారులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ గతంలో రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేశారు. ఆయనపై ఇప్పటికీ కేసు నడుస్తోంది. సీఐడి విచారణకు రమ్మన్నా ఆయన మొహం చాటేశారు. ఇప్పుడు ఏపీ సీఐడీ కాదు తెలంగాణ సిట్‌. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్న కేసు. విచారణకు వచ్చి ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నలకు సమాధానమిస్తారా లేకపోతే బీఎల్‌ సంతోష్‌ అండ్‌కో లాగే మొహం చాటేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో ఉండే పరిస్థితి ఎలాగూలేదు. ఇప్పుడు సిట్‌ నోటీసులకు స్పందించకపోతే హైదరాబాద్‌లో అస్సలు ఉండలేరు. దీంతో ఎందుకిలా నా ఖర్మ కాలిపోయిందనుకుంటున్నారు నరసాపురం ఎంపీ. అన్నిట్లో నేనంటూ ఏలెడితే ఇలాగే ఉంటుంది మరి. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా!